418: అర్ధరాత్రి ప్రీమియర్స్.. భయపడి గుండె ఆగితే ఎవరిదిరా రెస్పాన్సిబిలిటీ

ABN , Publish Date - Oct 18 , 2026 | 01:53 PM

ఈమధ్యకాలంలో హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. అయితే ప్రతి సినిమా భయపెడుతుంది అని చెప్పలేం. కానీ, '418' చిత్రం మాత్రం కచ్చితంగా భయపెడతాను అంటోంది.

418

ఈమధ్యకాలంలో హారర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. అయితే ప్రతి సినిమా భయపెడుతుంది అని చెప్పలేం. కానీ, '418' చిత్రం మాత్రం కచ్చితంగా భయపెడతాను అంటోంది. చైత్ర జే. ఆచార్, సూర్య రాజ్ వీరభద్రబతిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకి కీర్తన్ నాగగౌడ దర్శకత్వం వహించాడు. ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఇక సెన్సార్ సభ్యులే ఈ సినిమా చూసి భయపడిపోయారనే వార్తా తెలియడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 23 న రిలీజ్ కానుంది.


ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ప్రీమియర్స్ షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ.. ప్రీమియర్స్ షోస్ వేయడంలో తప్పేముంది.. అన్నీ సినిమాలకు వేస్తారుగా అంటే.. ప్రత్యేకంగా అర్ధరాత్రి మిడ్‌నైట్ ప్రీమియర్ షోలతో ప్రేక్షకులను భయపెట్టేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నార్మల్ హారర్ సినిమాలే రాత్రిపుట చూస్తే భయపడేవారు ఉన్నారు. అలాంటిది.. సెన్సార్ సభ్యులే భయపడిన ఈ సినిమా అర్ధరాత్రి మిడ్‌నైట్ ప్రీమియర్ షో చూస్తే ఏంటి పరిస్థితి అని నెటిజన్స్ భయపడుతున్నారు. కొందరు అయితే.. అర్ధరాత్రి ప్రీమియర్స్.. భయపడి గుండె ఆగితే ఎవరిదిరా రెస్పాన్సిబిలిటీ అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.


కథ విషయానికొస్తే.. సుమారు 15 ఏళ్లుగా మూసివేసి ఉన్న ఒక మెడికల్ కాలేజీ భవనం నేపథ్యం ఆధారంగా ఈ కథ తిరుగుతుంది. ముఖ్యంగా అందులోని రూమ్ నంబర్ 418 వెనుక ఉన్న నిగూఢమైన రహస్యం, అక్కడ జరిగే భయానక సంఘటనలే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. హారర్ సినిమాలను రాత్రివేళల్లో చూడటం ప్రేక్షకులలో మరింత థ్రిల్, ఉత్కంఠను కలిగిస్తుందనే ఉద్దేశంతో చిత్రబృందం అక్టోబర్ 22న మిడ్‌నైట్ ప్రీమియర్స్ ప్లాన్ చేసింది. అర్ధరాత్రి షోలు చూసిన ప్రేక్షకుల రెస్పాన్స్ సోషల్ మీడియా ద్వారా ముందే ప్రచారం పొందే అవకాశం ఉన్నప్పటికీ, కథలోని భయపెట్టే సన్నివేశాలు, కథనం విజయంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ వినూత్న ప్రచారం బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Oct 18 , 2026 | 01:56 PM