NTR: మహాభినిష్క్రమణకు 30 ఏళ్లు

ABN , Publish Date - Jan 18 , 2026 | 10:21 AM

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు యన్టీఆర్ పేరు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది... జనవరి 18వ తేదీన యన్టీఆర్ 30వ వర్ధంతి... యన్టీఆర్ మహాభినిష్క్రమణ జరిగి 30 ఏళ్ళయినా ఈ నాటికీ ఆయనను జనం స్మరించుకుంటూనే ఉండడం విశేషం...

నటరత్న నందమూరి తారక రామారావు (NTR) అవనిని వీడి అప్పుడే 30 ఏళ్ళయింది. 1996 జనవరి 18న మహాభినిష్క్రమణ చేసిన యన్టీఆర్ ను జనం మూడుపదుల కాలం దాటినా ఇంకా స్మరించుకుంటూనే ఉండడం విశేషం!


యన్టీఆర్ జీవితం... ఓ అధ్యయన పర్వం...

యన్టీఆర్ నటనాజీవితం, రాజకీయజీవితం రెండూ భావితరాలు అధ్యయనం చేయవలసిందే! ఇక ఆయన వ్యక్తిగత జీవితంలోని క్రమశిక్షణ, దీక్ష, పట్టుదలను కూడా జెన్ జెడ్ అలవరచుకుంటే విజయపథం వారి దరికి చేరుతుందని చెప్పవచ్చు. సినిమాల్లో సందేశాలు ఇవ్వడమే కాదు వాటిని ఆచరించి చూపిన ఘనుడాయన!... రాజకీయాల్లో వాగ్దానాలు చేయడం పరిపాటి- తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంస్కరణలు చేసిన ఘనత కూడా యన్టీఆర్ సొంతం.


తెలుగువారి గుండె గుడిలో...

 
యన్టీఆర్ నటజీవితం, రాజకీయజీవితంపై ఎన్నెన్నో పుస్తకాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిజం చెప్పాలంటే తెలుగువారికి యన్టీఆర్ ఓ తెరచి ఉంచిన పుస్తకం... యన్టీఆర్ నటనాపర్వంలోని పలు అధ్యాయాలు, రామారావు రాజకీయ రంగంలోని అనేక పర్వాలు తెలుగువారికి సుపరిచితాలు... యన్టీఆర్ మరణించిన తరువాత వెలుగు చూసిన తరాలు సైతం ఆయన పట్ల అభిమానం పెంచుకొని, లోతుగా ఆయనను అధ్యయనం చేస్తూ ఉండడం విశేషం... అందువల్లే యన్టీఆర్ జీవితగాథతో రూపొందిన చిత్రాలేవీ అంతగా అలరించలేకపోయాయి... ఎందుకంటే ఆ చిత్రాలను రూపొందించిన వారి కంటే యన్టీఆర్ గురించి జనానికే బాగా తెలుసు... అందువల్లే సదరు చిత్రాల్లో జనానికి ఏ వైవిధ్యమూ కనిపించలేదు... దీనిని బట్టే తెలుగువారు యన్టీఆర్ తమ గుండె గుడిలో ఎలా ఆరాధిస్తున్నారో అర్థమవుతుంది...
 

అన్న అభిమానుల అభిలాష...

 
యన్టీఆర్ నటనాజీవితం అనితరసాధ్యం ! శ్రీరామ, శ్రీకృష్ణ, రావణ, సుయోధన పాత్రల్లో యన్టీఆర్ అభినయం అలరించిన తీరు మరపురానిది- మరువలేనిది... ఇక రామారావు నటించిన జానపద, చారిత్రక, సాంఘికాల విషయానికి వస్తే సదరు చిత్రాలు సాధించిన విజయధ్వనులు ఈ నాటికీ మారుమోగుతూనే ఉన్నాయి... రాజకీయరంగంలోనూ రామారావు పయనం అదే తీరున సాగింది... సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఘనత యన్టీఆర్ సొంతం... ఇక రాజకీయాల్లో ఆయన ప్రవేశ పెట్టిన సంస్కరణలు ఇతర రాష్ట్రాల్లోనూ అమలవుతూనే ఉండడం గమనార్హం!  ఇంతటి ఘనచరితగల నందమూరి తారకరాముడిని 'భారతరత్న'తో గౌరవించాలన్నదే అభిమానుల అభిలాష! యన్టీఆర్ దివికేగి 30 సంవత్సరాలయిన సందర్భంగానైనా నటరత్న కీర్తికిరీటంలో భారతరత్న చేరుతుందేమో చూడాలి...

 

Updated Date - Jan 18 , 2026 | 11:07 AM