ఫ్లాప్ లేని డైరెక్టర్‌గా 25 ఏళ్లు.. ప్రపంచాన్ని శాసిస్తున్న రాజమౌళి
ABN , Publish Date - Sep 27 , 2026 | 06:56 PM
సినిమా పరిశ్రమలో రికార్డులు తిరగరాయడం కొందరికి అలవాటు అయితే, ఆ రికార్డులకు తానే కేరాఫ్ అడ్రస్‌గా మారడం ఒక్క ఎస్.ఎస్. రాజమౌళికే సాధ్యమైంది.
సినిమా పరిశ్రమలో రికార్డులు తిరగరాయడం కొందరికి అలవాటు అయితే, ఆ రికార్డులకు తానే కేరాఫ్ అడ్రస్‌గా మారడం ఒక్క ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli)కే సాధ్యమైంది. సరిగ్గా పాతికేళ్ల క్రితం.. 2001 సెప్టెంబర్ 27న స్టూడెంట్ నెం.1 అంటూ మెగాఫోన్ పట్టిన ఒక సాధారణ దర్శకుడు, ఈరోజు భారతీయ సినిమాను ప్రపంచ చిత్రపటంపై సగర్వంగా నిలబెట్టిన గ్లోబల్ డైరెక్టర్‌గా ఎదిగారు. పాతికేళ్ల ప్రయాణం.. డజనుకు పైగా అద్భుతాలు.. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క పరాజయం కూడా లేని అరుదైన ట్రాక్ రికార్డ్. ఈ చారిత్రక మైలురాయిని చేరుకున్న జక్కన్న ప్రస్తుతం వారణాసి సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు.
స్టూడెంట్ నెం.1తో మొదలైన ఆ జర్నీ సింహాద్రి తో తెలుగు నాట సరికొత్త మాస్ చరిత్రను లిఖించింది. ఆ తర్వాత సై అంటూ రగ్బీ ఆటను వెండితెరకు పరిచయం చేసినా, ఛత్రపతి తో ఇంటర్వెల్ బ్యాంగ్‌కు కొత్త భాష్యం చెప్పినా, విక్రమార్కుడు తో రా రస్టిక్ పోలీస్ పవర్ చూపించినా అది రాజమౌళికే చెల్లింది. అప్పటివరకు రొటీన్ ఫార్ములా కథలతో సాగుతున్న టాలీవుడ్‌ను కమర్షియల్ హద్దులు దాటించి సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. దర్శకుడిగా ఎదుగుతున్న క్రమంలో రాజమౌళి ఎప్పుడూ ఒకే జోనర్‌కు పరిమితం కాలేదు. మగధీర తో టాలీవుడ్ స్థాయిని పెంచి పునర్జన్మల కాన్సెప్ట్‌కు గ్రాఫిక్స్ జోడించి కలెక్షన్ల సునామీ సృష్టించారు.
ఇక కేవలం ఒక చిన్న ఈగను ప్రధాన పాత్రగా పెట్టి ఈగ లాంటి టెక్నికల్ వండర్‌ను తెరకెక్కించినప్పుడు దేశం మొత్తం ఆయన సృజనాత్మకతకు ఫిదా అయిపోయింది. స్టార్ హీరోలు లేకపోయినా, బలమైన కథనం ఉంటే విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించారు. ఆ తర్వాత వచ్చిన బాహుబలి రెండు భాగాలు భారతీయ సినీ చరిత్రను బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని మార్చివేశాయి. ప్రాంతీయ సరిహద్దులను చెరిపేసి, పాన్ ఇండియా అనే కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. అక్కడితో ఆగిపోకుండా ఆర్ఆర్ఆర్ తో హాలీవుడ్ ప్రేక్షకులను కూడా కట్టిపడేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆయన చూపించిన విశ్వరూపానికి ప్రపంచం దాసోహమైంది. గ్లోబల్ మార్కెట్‌లో రాజమౌళి బ్రాండ్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టారు.
సెట్స్‌పైకి అడుగుపెడితే రాజమౌళిలో కనిపించేది అంకితభావం, పట్టుదల మాత్రమే. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన చూపించే కేరింగ్ అమోఘం. హీరోలను, నటీనటులను ఎంత కష్టపెడతారో, వెండితెరపై వాళ్లకు అంతటి కెరీర్ బెస్ట్ అవుట్‌పుట్‌ను అందిస్తారు. శిల్పాన్ని చెక్కినట్లు ప్రతి సన్నివేశాన్ని తీర్చిదిద్దుతారు కాబట్టే ఆయన్ను అందరూ జక్కన్న అని పిలుచుకుంటారు. నటీనటుల నుంచి తనకు కావాల్సిన ఎమోషన్‌ను రాబట్టే వరకు ఆయన విశ్రమించరు. ఇప్పుడు పాతికేళ్ల కెరీర్ మైలురాయి వేళ, రాజమౌళి తన 13వ ప్రాజెక్ట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి ని సిద్ధం చేస్తున్నారు.
ఇది కేవలం పాన్ ఇండియా సినిమా మాత్రమే కాదు, గ్లోబల్ వైడ్ యాక్షన్ అడ్వెంచర్. దాదాపు 1300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, పూర్తి ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చింది, ప్రస్తుతం చిత్ర యూనిట్ అత్యంత ఆధునిక సాంకేతికతతో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉంది. ఈ చిత్రంలో మహేష్ అటు రుద్రగా, ఇటు రాముడిగా రెండు వైవిధ్యమైన పాత్రల్లో కనిపించబోతుండటం సినీ ప్రియుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చింది.