ఎన్టీఆర్‌ 'ఆది'.. ఇప్పుడు వ‌చ్చి ఉంటేనా రూ.వెయ్యి కోట్లు ప‌క్కా

ABN , Publish Date - Mar 29 , 2026 | 07:37 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్‌ను మలుపు తిప్పిన ఆది (Aadi) సినిమా విడుదలై నేటికి (మార్చి 28) 24 ఏళ్లు పూర్తయింది.

aadi

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కెరీర్‌ను మలుపు తిప్పిన ఆది (Aadi) సినిమా విడుదలై నేటికి (మార్చి 28) 24 ఏళ్లు పూర్తయింది. 19 ఏళ్ల పిన్న వయసులోనే ఎన్టీఆర్‌కు తిరుగులేని మాస్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టిన ఈ చిత్రం, దర్శకుడిగా వి.వి. వినాయక్ (V. V. Vinayak)కు మొదటి సినిమా కావడం విశేషం. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫ్యాక్షన్ కథా చిత్రాలకు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ, కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ఎంతో మంది సినీ ప్రముఖులకు స్ఫూర్తిని నింపింది. హీరోయిన్‌ కీర్తి చావ్లా (Keerti Chawla) కు కూడా ఇదే తొలి తెలుగు సినిమా కావడం మరో విశేషం.

ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. వినాయక్ తొలుత 'శ్రీ' అనే ప్రేమకథను ఎన్టీఆర్‌కు వినిపించి ఓకే చేయించుకున్నారు. అయితే ప్రారంభోత్సవానికి ముందే ఎన్టీఆర్ ఆ కథను తిరస్కరించడంతో వినాయక్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను మరో అవకాశం కోరి, కేవలం రెండు రోజుల్లోనే 'ఆది' కథను సిద్ధం చేశారు. ఆ పవర్ ఫుల్ కథ వినగానే ఎన్టీఆర్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. 'ఆది' తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సాంబ’, ‘అదుర్స్‌’ వంటి హిట్ చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం అభిమానులు ‘అదుర్స్‌ 2’ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా, అది చేయకపోవడమే బెటర్‌ అన్న అభిప్రాయాన్ని వినాయక్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యక్తం చేయడం గమనార్హం.

2002 మార్చి 28న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. నిర్మాత బెల్లంకొండ సురేష్ కేవలం రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. అప్పట్లో టికెట్ రేట్లు కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.35 వరకు మాత్రమే ఉండేవి. అంత తక్కువ ధరకు టికెట్లు అమ్మినా కూడా.. థియేటర్ కలెక్షన్స్, శాటిలైట్, మ్యూజిక్ రైట్స్ అన్నీ కలుపుకుని దాదాపు రూ.30 కోట్లు రాబట్టిందంటే ఎన్టీఆర్ బాక్సాఫీస్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నేటి పరిస్థితుల్లో ఈ సినిమా రిలీజ్ అయి ఉంటే, వసూళ్లు ఖచ్చితంగా రూ.వెయ్యి కోట్ల వరకు ఉండేవని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తుంటాయి.

రికార్డుల పరంగానూ 'ఆది' ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమా 96 కేంద్రాల్లో వంద రోజులు, 121 కేంద్రాల్లో 50 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. మణిశర్మ అందించిన అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. నేటికీ ఈ పాటలు, బిజిఎమ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉండటం ఈ సినిమాకున్న క్రేజ్‌కు నిదర్శనం. 'ఆది' సక్సెస్‌తో ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రొడ్యూసర్లకు 'హాట్ కేక్'గా మారిపోయారు.

ప్రతిభావంతులైన ఈ చిత్ర బృందానికి నంది అవార్డుల పంట పండింది. ఉత్తమ నూతన దర్శకుడిగా వి.వి.వినాయక్, ఉత్తమ ఎడిటర్‌గా గౌతంరాజు, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్ పురస్కారాలు అందుకున్నారు. ఎన్టీఆర్ తన అద్భుత నటనకు గానూ స్పెషల్ జ్యూరీ అవార్డును దక్కించుకున్నారు. నందమూరి అభిమానుల గుండెల్లో 'ఆది' ఎప్పటికీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

Updated Date - Mar 29 , 2026 | 07:59 PM