రెండు దశాబ్దాల ప్రయాణంలో శ్రీమతి సహకారం మరవలేను...
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:54 PM
దర్శకుడు అనిల్ కృష్ణ కన్నెగంటి రూపొందించిన తొలి చిత్రం 'అసాధ్యుడు' విడుదలై ఇరవై సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ ఇరవై యేళ్ళలో ఆయన ఐదు చిత్రాలు డైరెక్ట్ చేశారు. తాజా కన్నడ చిత్రం 'డాడ్' త్వరలో విడుదల కానుంది.
దర్శకుడు అనిల్ కృష్ణ కన్నెగంటి (Anil Krishna Kanneganti) దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'అసాధ్యుడు' (Asadhyudu) విడుదలై ఫిబ్రవరి 16వ తేదీకి ఇరవై సంవత్సరాలు పూర్తయ్యింది. వల్లూరిపల్లి రమేశ్ (Valluripalli Ramesh) నిర్మించిన ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram), దియా (Diya) జంటగా నటించారు. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా దర్శకుడిగా అనిల్‌కు మంచి గుర్తింపే వచ్చింది. దాంతో మంచు మనోజ్ (Manchu Manoj), కృతీ కర్బందా, సనా ఖాన్ ప్రధాన తారలుగా 'మిస్టర్ నోకియా' చిత్రాన్ని తెరకెక్కించాడు. డి.ఎస్. రావు నిర్మించిన ఈ సినిమా చివరకు 'మిస్టర్ నూకయ్య' పేరుతో 2012లో విడుదలైంది. ఆ తర్వాత సందీప్ కిషన్ హీరోగా 'రన్' (Run) చిత్రం రూపొందించాడు అనిల్ కృష్ణ కన్నెగంటి. ఇక కొంతకాలం క్రితం అశ్విన్ బాబు, నందితా శ్వేతతో అనిల్ 'హిడింబ' (Hidimba) సినిమాను తెరకెక్కించాడు. ప్రస్తుతం కన్నడలో శివరాజ్ కుమార్ (Shivaraj Kumar) ప్రధాన పాత్రధారిగా 'డాడ్' (Dad) మూవీని రూపొందిస్తున్నాడు. ఈ ఇరవై యేళ్ళ ప్రయాణాన్ని తలుచుకుంటూ ఈ క్రమంలో తనకు సహకరించిన వారికి అనిల్ కృతజ్ఞతలు తెలిపాడు.
'అసాధ్యుడు, మిస్టర్ నూకయ్య, రన్, హిడింబ... ఇప్పుడు డాడ్'. ఈ ఇరవై సంవత్సరాలలో సంఖ్యాపరంగా నేను ఏం సాధించానో నాకు తెలియదు. కానీ సినిమానే శ్వాసించడం గొప్ప తృప్తిని కలిగించింది. ఒక దర్శకుడిగా విభిన్నమైన చిత్రాలు తెరకెక్కించాడనికి ప్రయత్నం చేశాను. ఇరవై యేళ్ళ పాటు ఈ రంగంలో నిలబడటం అనేది సామాన్య విషయం కాదు. కేవలం పేషన్ ఉంటేనే అది సాధ్యమౌతుందని నా నమ్మకం. ఈ రెండు దశాబ్దాల కాలంలో నాతో కలిసి ప్రయాణం చేసిన ప్రతి నటుడికి, ప్రతి సాంకేతిక నిపుణుడికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ ప్రయాణంలో నా భార్య అందించిన సహకారం మరువలేనిది. ఆమె లేకుండా నేను దీన్ని సాధించేవాడిని కాదు. ప్రతి అనిశ్చిత పరిస్థితిలోనూ ఆమె నిశ్శబ్దంగా నా వెంటే నిలబడి, నేను ధైర్యంగా ఈ రంగంలో ముందుకు పోవడానికి సహకరించింది. ఈ ఇరవై యేళ్ళ ప్రయాణంలో నా మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు' అని అన్నారు.