చిత్రపురి సొసైటీలో రూ.110 కోట్ల కుంభకోణం!
ABN , Publish Date - Oct 01 , 2026 | 10:15 AM
ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్నారని, యూనియన్లలో అక్రమ జోక్యం చేసుకుంటూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని పలు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు.
ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ( Film Employee Federation) అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ( Vallabhaneni Anil) నియంతృత్వ పోకడలు అవలంబిస్తున్నారని, యూనియన్లలో అక్రమ జోక్యం చేసుకుంటూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని పలు సంఘాల ప్రతినిధులు ఆరోపించారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీ (Chitrapuri Housing Society) వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ చిత్రపురి సాధన సమితి, తెలంగాణ జేఏసీ ఫిలిం వింగ్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధులు మంగళవారం ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. అనిల్ ఆక్రమాలపై తక్షణమే కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్స్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ మద్దినేని రమేష్ మాట్లాడుతూ 26 వేల మంది కార్మికులు ఉన్న ఫెడ రేషన్‌ను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని, డ్యాన్సర్స్ అసోసియేషన్, మహిళా వర్కర్స్ యూనియన్లలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.
చిత్రపురి సాధన సమితి నేత డాక్టర్ కస్తూరి శ్రీనివాస్ మాట్లాడుతూ చిత్రపురి సొసైటీలో గతంలో రూ.110 కోట్ల మేర ఆర్థిక అవకతవకలు జరిగాయని, 2020-2025 నివేదికను తొక్కిపెట్టారని ఆరోపించారు. 1,300 మంది నాన్ మెంబర్ల అర్హతలను తేల్చకుండా రిజిస్ట్రేషన్లు చేయవద్దన్నారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమ లతాదేవి మాట్లాడుతూ ప్రశ్నించినందుకు తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కార్యక్రమంలో సినీ సంఘాల ప్రతినిధులు హేమ జిల్లాజు, కలగారా సుధీర్, భీమ్ రెడ్డి, గుర్రం రాజు, ఉస్మానియా నగేష్ పాల్గొన్నారు.