Tollywood: ఈ వారం ఏకంగా పది చిత్రాలు!
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:04 AM
ఈ శుక్రవారం చిన్న సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. రెండు డబ్బింగ్ సినిమాలతో కలిపి ఏకంగా పది చిత్రాలు జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ప్రఖ్యాత దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' కూడా ఉండటం విశేషం.
గతంలో హీరోలుగా రాణించిన చాలా మంది ఇవాళ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. వరుస సినిమాలతో బిజీగానూ ఉన్నారు. ఆ కోవకే చెందిన జగపతిబాబు, శ్రీకాంత్ మళ్ళీ హీరోలుగా నటించిన రెండు సినిమాలు ఈ శుక్రవారం విడుదల అవుతున్నాయి. అవే 'వదలా', 'మిస్టర్ మిడిల్ క్లాస్'. విశేషం ఏమంటే ఆ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ లయ నే! జగపతిబాబు హారర్ జానర్ లో మూవీ చేయగా, శ్రీకాంత్ ఫాంటసీ కథను ఎంచుకున్నాడు. 'వదలా' చిత్రాన్ని ఆకెళ్ళ వి కృష్ణ దర్శకత్వం వహించగా, 'మిస్టర్ మిడిల్ క్లాస్'ను జి. నాగేశ్వరరెడ్డి తెరకెక్కించారు. 'వదలా' చిత్రంలో ఆమని మేనకోడలు హృతిక శ్రీనివాస్ కీలక పాత్ర పోషిస్తే... 'మిస్టర్ మిడిల్ క్లాస్'లో రాజేంద్ర ప్రసాద్ వేంకటేశ్వరస్వామిగా కనిపించబోతున్నారు. ఇక ఇదే శుక్రవారం పోసాని కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన 'ఆపరేషన్ అరుణారెడ్డి' మూవీ సైతం విడుదల కాబోతోంది. పోసాని కూడా గతంలో కొన్ని చిత్రాలలో హీరోగా నటించారు. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు.
గత యేడాది సంక్రాంతికి విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది ఐశ్వర్య రాజేశ్. ఆ తర్వాత యేడాదిన్నరకు ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమా 'ఓ సుకుమారి'తో జనం ముందుకొస్తోంది. తిరువీర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తనను పట్టుకుంటే షాక్ కొట్టే వింతైన అమ్మాయిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఈ సినిమాతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అలానే నరేశ్ అగస్త్య, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించిన క్రైమ్ కామెడీ మూవీ 'ఎం.ఆర్.పీ.' శుక్రవారమే విడుదల అవుతోంది. ఈ సినిమాతో డోనాల్ బిష్త్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈటీవీ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇప్పుడు ఆయన కూతురు దివిజ ప్రభాకర్ హీరోయిన్ గా 'వెంకట్రామయ్య గారి తాలూకా' మూవీతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. దినేశ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాను జానపద గాయని కోమలి నిర్మించడం విశేషం.
ఈ శుక్రవారం వస్తున్న మరో సినిమా 'రాజా ది రాజా'. రుత్విక్, విశాఖ ధిమాన్ ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. హీరో రుత్విక్ సోదరి దాసరి నిహారిక ఈ సినిమాను నిర్మిస్తోంది. విశేషం ఏమంటే... ఈ సినిమాలో నటిస్తున్న కొత్త జంట ఇందులో ద్విపాత్రాభినయం చేస్తోంది. అలానే ఈ శుక్రవారం వస్తున్న మరో సినిమా 'ఒక కోర్టు కేసు'. గణేశ్ పూడి దర్శకత్వం వహిస్తున్న ఈ లీగల్ డ్రామాలో సూర్యాన్ష్, తనిషా మిశ్రా హీరోహీరోయిన్లుగా నటించారు. భారతీయదేశంలో పూరి జగన్నాథ యాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ దేవదేవుని గొప్పతనాన్ని తెలియచేస్తూ తెరకెక్కిన యానిమేషన్ మూవీ 'మహాప్రభు జగన్నాథ్' సైతం శుక్రవారం వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న చిత్రం 'ది ఒడిస్సీ'. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ గ్రీకు పురాణగాథ... తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో 17న థియేటర్లలో సందడి చేయబోతోంది. అలానే ఈ వీకెండ్ లో రామ్ గోపాల్ వర్మ 'రక్తచరిత్ర' మొదటి భాగాన్ని సైతం మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ వైవిధ్యభరితమైన చిత్రాలలో వేటికి ప్రేక్షకులు పట్టం కడతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
సూపర్ స్టార్ సినిమాలో డ్రాగన్ బ్యూటీ..
బాలయ్య బిడ్డ తేజస్విని డ్యాన్స్‌ల వెనుక మతలబు ఏంటి? హీరోయిన్‌గా ఏమైనా..