ప్రపంచ దృష్టిని ఆకర్షించిన 22 ఏళ్ళ డైరెక్టర్
ABN , Publish Date - Apr 22 , 2026 | 07:05 PM
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో.. కన్నడకు చెందిన యంగ్ డైరెక్టర్ కరెన్ క్షితి సువర్ణ కాన్స్ ఫెస్టివల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిన్న వయసులోనే అరుదైన గౌరవాన్ని అందుకుని సంచలనంగా మారింది.
టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించింది కన్నడ యువ దర్శకురాలు కరెన్ క్షితి సువర్ణ. మొదటి సినిమాతోనే గ్లోబల్ సినీ మ్యాప్‌పై తన పేరును లిఖించుకుంది. చిన్న వయసులోనే అరుదైన గౌరవం అందుకోవడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె రూపొందించిన ‘సెప్టెంబర్ 21’ అనే ఇండిపెండెంట్ మూవీ ప్రతిష్ఠాత్మక కాన్స్ చలన చిత్రోత్సవంలో ప్రీమియర్‌కు ఎంపికైంది. మే 16న కాన్స్‌లోని పాలైస్ థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. అతి చిన్న వయస్సులోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం భారత చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారడంతో పాటు హాట్ టాపిక్ గా మారింది.
కన్నడ-హిందీ భాషల్లో తీసిన ఈ చిత్రం అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న ఒక వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. ఆ వ్యాధి కేవలం రోగి మీద మాత్రమే కాకుండా, అతన్ని చూసుకునే కుటుంబ సభ్యులపై కూడా చూపే మానసిక ప్రభావాన్ని ఎంతో భావోద్వేగంగా, సున్నితంగా చిత్రీకరించింది. యువతతో నిండిన టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి కొత్త ఊపిరి పోసింది. గ్లోబల్ వేదికపై ప్రదర్శనతో ఈ సినిమాపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. వివిధ దేశాల్లో ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రియాంకా ఉపేంద్ర (Priyanka Upendra), జరీనా వహాబ్ (Zarina Wahab) వంటి సీనియర్ నటీమణులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో యువ నటుడు ప్రవీణ్ సింగ్ సిసోడియా (Pravin Singh Sisodia) కూడా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారు. పరిమిత వనరులతో… అపారమైన విజన్‌తో, అతి చిన్న వయస్సులోనే అంతర్జాతీయ వేదికపై భారతీయ జెండాను ఎగురవేయడం భారతీయ సినీ పరిశ్రమకు... ముఖ్యంగా కన్నడ సినిమాకు గర్వకారణం. కంటెంట్ బలంగా ఉంటే ప్రపంచం తలొగ్గుతుందనే సత్యాన్ని ఈ 22 ఏళ్ల దర్శకురాలు మరోసారి చాటిచెప్పింది. మొత్తానికి ఆమె టాలెంట్‌కు గ్లోబల్ లెవల్ గుర్తింపు రావడంతో ఫ్యూచర్ లో మరిన్ని మంచి చిత్రాలు తీసే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.