Toxic: టాక్సిక్’పై పెరుగుతున్న క్రేజ్.. బుకింగ్స్ చూస్తే రికార్డులు పక్కా
ABN , Publish Date - Aug 23 , 2026 | 08:41 AM
కేజీయఫ్ సిరీస్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్, నాలుగేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం టాక్సిక్.
కేజీయఫ్ (KGF) సిరీస్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ స్టార్ యశ్ (yash), నాలుగేళ్ల విరామం తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ (geethu Mohandas) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై తొలి రోజుల్లో పెద్దగా అంచనాలు లేవు. పైగా సినిమా షూటింగ్ దశలో పలుమార్లు వాయిదాలు పడటంతో అభిమానుల్లో కొంత నిరుత్సాహం నెలకొంది. అయితే, మేకర్స్ విడుదల చేసిన ఒక్కో పోస్టర్, యశ్ మాస్ లుక్ ఈ చిత్రంపై అంచనాలను పెంచేలా చేశాయి.
ఈ రోజుల్లో సినిమా వాయిదా పడితే ఆ సినిమాపై అంచనాలు తగ్గి, ఆ సినిమా రిజల్ట్‌పై ప్రభావం చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సినిమాలు మాత్రమే ఈ థియరీని బ్రేక్ చేస్తాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ అన్నింటిలో కూడా మితిమీరిన రొమాన్స్, యాక్షన్ బ్లడ్ బాత్ ఎక్కువవడం పైగా ఈ సినిమా పిల్లలతో అస్సలు చూడద్దని చెప్పడం సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. దీనికి తగ్గట్టుగానే బుక్ మై షోలో బుకింగ్స్ పరంగా జోరు కనిపిస్తుంది. కేవలం 24 గంటల్లోనే బుక్‌మైషోలో 3.35 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై, ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేశాయి. ఈ జోరు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తుండటంతో ఇక్కడ కూడా భారీ స్పందన లభిస్తోంది. టిక్కెట్ రేట్ల పెంపు గురించి తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా టిక్కెట్లు హోల్డ్‌లో పెట్టడం జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో యశ్ తన అభిమానులపై చూపించిన అభిమానం, ప్రమోషన్లలో ఆయన వేగం తెలుగు ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి. ఈ పాజిటివ్ బజ్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టే అవకాశముంది.
ఇక ఈ చిత్రంలో తండ్రీ కొడుకులుగా యశ్ డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారు. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ వంటి అగ్ర నటీమణులు నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ తో పాటు యష్ సొంత నిర్మాణ సంస్థ 'మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్' అత్యంత ప్రతిష్టాత్మకంగా, రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రాబోయే ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతోంది. ఈ సంచలనాలతో టాక్సిక్ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.