Yashika anand: సోలో లైఫ్ సో బెటర్.. ఇదే హ్యాపీ..
ABN , Publish Date - Aug 02 , 2026 | 10:48 AM
నటి యషికా ఆనంద్ (Yashika Anand) మరోసారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
నటి యషికా ఆనంద్ (Yashika Anand) మరోసారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన ఇంట్లో చిన్న బార్ సెటప్ ఉన్నప్పటికీ తాను మాత్రం మద్యం సేవించనని స్పష్టం చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవనశైలి, స్నేహితులతో గడిపే సమయం, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
యషికా మాట్లాడుతూ 'గత ఐదేళ్లుగా బయట జరిగే పార్టీలకు దూరంగా ఉంటున్నాను. అందుకే స్నేహితులు, సన్నిహితులు కలుసుకునేందుకు తన ఇంట్లోనే చిన్న బార్ ఏర్పాటు చేశాను. వారాంతాల్లో స్నేహితులు ఇంటికి వచ్చి సరదాగా గడుపుతుంటారని, వారికి కావాల్సిన ఆతిథ్యం అందిస్తాను. ఇంట్లో మద్యం అందుబాటులో ఉన్నా.. నేను మద్యం సేవించను. అతిథులు మద్యం సేవించినా, వారికి కేవలం తోడుగా మాత్రమే ఉంటాను' అన్నారు.
వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె మాట్లాడారు. 'ఐదేళ్ల క్రితం నా ప్రేమ వ్యవహారం ముగిసింది. ఆ విషయం అందరికీ తెలిసిందే! అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాను. ప్రస్తుతం సింగిల్ లైఫ్‌ను ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తున్నాను' అని తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే యాషిక లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. విజయ్ దేవరకొండ నటించిన 'నోటా', నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'అమ్మోరు తల్లి' చిత్రాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.