Nelson Dilipkumar: కమల్, రజనీని.. నెల్సన్ హ్యాండిల్ చేయగలడా?

ABN , Publish Date - Jan 30 , 2026 | 06:21 PM

భారతీయ సినిమా చరిత్రలో ఇద్దరు ధృవతారలు.. ఒకరు విశ్వనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan), మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్

Nelson Dilipkumar

భారతీయ సినిమా చరిత్రలో ఇద్దరు ధృవతారలు.. ఒకరు విశ్వనటుడు కమల్‌ హాసన్ (Kamal Haasan), మరొకరు సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth). కెరీర్‌ మొదట్లో కలిసి నటించిన వీరిద్దరూ, స్టార్‌ హీరోలకుగా ఎదిగాక మాత్రం ఒకే ఫ్రేమ్‌పై కనిపించలేదు. మళ్లీ ఇన్ని సంవత్సరాల తరువాత ఈ క్రేజీ కాంబోను రిపీట్‌ చేయాలని కమల్ హాసన్ స్వయంగా ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి స్నేహితుడు అయిన రజనీకాంత్‌ నుంచి కూడా ఆమోదం వచ్చింది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇద్దరు స్టార్‌ హీరోలను ఒకే స్క్రీన్‌ పై హ్యాండిల్‌ చేయడమంటే ఏ దర్శకుడికైనా కత్తి మీద సాములాంటిదే.

మొదట ఈ బాధ్యత లోకేష్ కనగరాజ్ చేతికి వెళ్లింది. కానీ కూలీ సినిమా డిజాస్టర్‌ అవ్వడం, లోకేష్‌ వీళ్లిద్దరి కోసం చెప్పిన కథ నచ్చక పోవడంతో లోకేష్‌ ఆ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత అరుణాచలం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సి. సుందర్ పేరు వినిపించింది. కానీ ఆయన కూడా ప్రస్తుతం వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) చేతికి చేరినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ కు జైలర్ తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన నెల్సన్ పై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన రజనీతోనే జైలర్-2 పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాతే రజనీ-కమల్ మల్టీస్టారర్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. నెల్సన్ ఒక స్ట్రయిట్‌ తెలుగు సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ అది నిజమైతే, ఈ లోపు రజనీ - కమల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా? లేక తెలుగు సినిమా తర్వాతే మొదలవుతుందా? అనేది సస్పెన్స్ గా మారింది. ఇద్దరు లెజెండరీ హీరోలను ఒకే సినిమాలో చూపించడం అంటే దర్శకుడికి కత్తి మీద సాము లాంటిదే. కథలో ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉండాలి.. ఎలివేషన్లు సరిగ్గా కుదరాలి.. అలాగే ఇద్దరు స్టార్ల ఇమేజ్ కు భంగం కలగకూడదు. చిన్న తేడా వచ్చినా అభిమానుల నుంచి వచ్చే విమర్శలు తీవ్రంగా ఉంటాయి. నెల్సన్ మార్కు డార్క్ హ్యూమర్ ఈ ఇద్దరు సీనియర్ స్టార్లకు ఎంతవరకు సెట్ అవుతుందనేది ఆసక్తికరం. అన్ని అనుకూలిస్తే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇదొక బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ అవుతుంది. మరి నెల్సన్ ఈ భారీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మెప్పిస్తారో లేదో చూడాలి.

Updated Date - Jan 30 , 2026 | 06:21 PM