రజనీ 173కి దర్శకుడు ఎవరు? ఇంకా రాని క్లారిటీ!
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:00 AM
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించే 173వ చిత్ర దర్శకుడు ఎవరన్న విషయంపై ఇంకా ఓ స్పష్టత రాలేదు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటించే 173వ చిత్ర దర్శకుడు ఎవరన్న విషయంపై ఇంకా ఓ స్పష్టత రాలేదు. కమల్ హసన్ (Kamal Haasan) నిర్మిస్తోన్నఈ చిత్రానికి గతంలో శివకార్తికేయన్‌తో ‘డాన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన శిబి చక్రవర్తి (Cibi Chakaravarthi) దర్శకత్వం వహిస్తారంటూ ప్రచారం సాగింది. అందుకు తగినట్టుగానే ఆయన ‘రజనీ 173’ ప్రీ ప్రొడక్షన్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు.
అయితే, రజనీ చిత్రాన్ని అంగీకరించేందుకు ముందుగా ఓ తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించేందుకు శిబి చక్రవర్తి కొంత మొత్తాన్ని అడ్వాన్స్ తీసుకున్నారు. ఇపుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో సమస్యలు ఏర్పడినట్టు సమాచారం. అందుకే ‘రజనీ 173’ ప్రాజెక్టు నుంచి శిబి తప్పుకుని, ఆ స్థానంలో అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారంటూ సినీ పరిశ్రమ వర్గాల సమాచారం.
అయితే, అశ్వత్ మారిముత్తు కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ నుంచి ఎన్‌వోసీ పొందిన తర్వాతే రజనీ చిత్రాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. దీంతో రజనీ 173 దర్శకుడు ఎవరన్నదానిపై ఇంకా ఒక స్పష్టత లేకపోగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ నిర్మాణ పనుల కోసం రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ఎంతో ఖర్చు చేసినట్టు సమాచారం. ఇపుడు దర్శకుడు ఎవరన్నది క్లారిటీ ఇచ్చేందుకు నిర్మాత కమల్ హాసన్ ప్రయత్నిస్తున్నారు.