ఇటు రశ్మిక... అటు దుష్యంత్ ఒకే రోజు పెళ్ళి!

ABN , Publish Date - Feb 17 , 2026 | 11:30 AM

కర్ణాటకకు చెందిన స్టార్ హీరోయిన్ రశ్మిక మందణ్ణ వివాహం, రాజకీయ కుటుంబానికి చెందిన హీరో దుష్యంత్ వివాహం ఈ నెల 26న జరుగబోతున్నాయి. ఈ రెండు పెళ్ళిళ్ళతో కన్నడ చిత్రసీమలో పెళ్ళి కళ తాండవిస్తోంది.

Sandalwood Wedding Celebrations

కన్నడ చిత్రసీమకు పెళ్ళి కళ వచ్చేసింది. కన్నడ భామ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) వివాహం తెలుగువాడైన స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో జరుగుతుంటే... కన్నడ చిత్రసీమలోకి 'గత వైభవ' చిత్రంతో హీరోగా అడుగు పెట్టిన దుష్యంత్ (Dushyanth) వివాహం రాజకీయ కుటుంబానికి చెందిన రచనతో జరుగబోతోంది. విశేషం ఏమంటే వీరిద్దరి పెళ్ళి జరుగుతోంది ఈ నెల 26నే!.

కన్నడ సినిమా 'కిరిక్ పార్టీ'తో 2016లో రశ్మిక మందణ్ణ సినీ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత యేడాది ఆమె 'అంజని పుత్ర, చమక్' చిత్రాలలో నటించారు. 2018లో 'ఛలో' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రశ్మిక, 2021లో 'సుల్తాన్' మూవీతో కోలీవుడ్ లోకి, 2022లో 'గుడ్ బై' సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన 'పుష్ప' సినిమాతో రశ్మిక నేషనల్ క్రష్‌గా మారిపోయారు. ఇప్పటికే విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం, డియర్ కామ్రేడ్' చిత్రాలలో రశ్మిక నటించారు. ఆ సమయంలో చిగురించిన ప్రేమ... పరిణయానికి దారితీసింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'రణబాలి' చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే వివాహ నిశ్చితార్థం జరగ్గా, వీరి వివాహం ఈ నెల 26న ఉదయ్ పూర్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుగుబోతోంది. మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో మార్చి 4న జరుగుతుంది.


ఇక కన్నడ సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టిన దుష్యంత్ గుబ్బి నియోజక వర్గం శాసన సభ్యులు ఎస్.ఆర్. శ్రీనివాస్ కుమారుడు. నటన మీద ఆసక్తితో కొన్ని సంవత్సరాల పాటు శిక్షణ తీసుకున్న దుష్యంత్ 'గత వైభవ'తో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా జనవరి 1న 'గత వైభవం' పేరుతో ఈ సినిమా తెలుగులో డబ్ అయ్యి, రిలీజ్ అయ్యింది. ఇందులో ఆషికా రంగనాథ్‌ హీరోయిన్‌గా నటించింది. దుష్యంత్ వివాహం మాజీ ఎంపీ ఎస్.పి. ముద్దహనుమె గౌడ కుమార్తె రచనతో జరుగనుంది. వీరి వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగింది. దుష్యంత్‌, రచన పెళ్ళి బెంగళూరులోని చామర వజ్ర, ప్యాలెస్ గ్రౌండ్‌లో ఈ నెల 26న అంగరంగ వైభవంగా జరుగబోతోంది. మార్చి 1న వెడ్డింగ్ రిసెప్షన్ ను ఉంటుంది. మొత్తం మీద సినీ రాజకీయ కుటుంబాలకు చెందిన ఈ రెండు వివాహాలతో కన్నడ చిత్రసీమకు పెళ్ళికళ వచ్చేసింది.

Updated Date - Feb 17 , 2026 | 11:30 AM