Makutam Trailer: మూడు పాత్రల్లో విశాల్ నట విశ్వరూపం

ABN , Publish Date - Aug 07 , 2026 | 09:36 PM

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మకుటం. ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 99వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది.

Makutam

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal) హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం మకుటం (Makutam). ఆర్.బి. చౌదరి సమర్పణలో ప్రతిష్టాత్మక సూపర్‌గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 99వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో విశాల్ సరసన అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటించగా జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆగస్ట్ 14న మకుటం రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన మేకర్స్ తాజాగా మకుటం ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.


సుమారు 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ యాక్షన్, కామెడీ, రొమాన్స్, డ్రామాల మేళవింపుగా ఆకట్టుకుంటోంది. విశాల్ ఈ సినిమాలో మూడు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించాడు. కృపాకర్ మెడికల్ రిప్రజెంటేటివ్‌.. అతనికి కుటుంబమే లోకం. ఇక ఇంకోపక్క లింగా హార్బర్ కాంట్రాక్టర్‌. హార్బర్ లో సరుకుల స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అనుకోకుండా కృపాకర్ కి లింగాకి మధ్య యుద్దం మొదలవుతుంది. వీరిద్దరూ కొట్టుకొనేది దేనికోశం.. ఈ ఇద్దరు కాకుండా కడలినే శాసించేవాడు ఎవడు.. ? అసలు ఈ ముగ్గురు వేరు వేరా.. లేక ఒక్కరేనా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


మెడికల్ రిప్రజెంటేటివ్‌గా, హార్బర్ కాంట్రాక్టర్‌గా, ఇళయరాజా అభిమానిగా బహుముఖ కోణాల్లో విశాల్ కనిపించాడు. అంజలి పాత్ర చాలా అద్బుతంగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు ట్రైలర్‌ను మరింత ఎనర్జెటిక్‌గా మార్చాయి. విశాల్ నటనతో పాటు తొలిసారిగా మెగాఫోన్ పట్టి నడిపించిన దర్శకత్వ ప్రతిభ కూడా ఈ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్. మరి ఈ సినిమాతో విశాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Aug 07 , 2026 | 09:49 PM