లార్ గిబ్బన్ కోతితో వీడియో.. విక్రమ్‌కు అట‌వీశాఖ నోటీసులు

ABN , Publish Date - Aug 13 , 2026 | 07:15 PM

లార్ గిబ్బన్ కోతితో విక్రమ్ వీడియో వైరల్ కావడంతో తమిళనాడు అటవీశాఖ విచారణ చేపట్టింది. తాజాగా విక్రమ్‌కు నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

vikram

తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) ప్రస్తుతం ఓ అరుదైన వన్యప్రాణికి సంబంధించిన వివాదంలో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విక్ర‌మ్‌ లార్ గిబ్బన్ ( Lar Gibbon) కోతితో విక్రమ్ ఉన్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వివాదం మరింత ముదిరింది. దీంతో ఈ విష‌యం తమిళనాడు అటవీశాఖ దృష్టిన ప‌డింది. లార్ గిబ్బన్‌ను ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? దాన్ని పెంచేందుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా ఈ కేసులో విక్రమ్‌కు అటవీశాఖ నోటీసులు జారీ చేశారు.

లార్ గిబ్బన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను మూడు రోజుల్లోగా అటవీశాఖకు సమర్పించాలని అధికారులు విక్రమ్‌ను ఆదేశించారు. ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చెందినది, విక్రమ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల వద్దకు ఎప్పుడు తీసుకువచ్చారు వంటి వివరాలను ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం. అలాగే లార్ గిబ్బన్‌ను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? దానికి సంబంధించిన పత్రాలు ఏమిటి? కోతి కొనుగోలు, బదిలీ, పెంపకానికి సంబంధించిన రికార్డులు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలపై కూడా అధికారులు వివరాలు కోరినట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 13 , 2026 | 07:17 PM