Jana Nayagan: విజయ్..'జన నాయగన్‌'కు సెన్సార్ చిక్కులు

ABN , Publish Date - Jan 07 , 2026 | 10:00 AM

విజయ్ తాజా చిత్రం 'జన నాయగన్'కు సెన్సార్ చిక్కులు తప్పడం లేదు. మొదట యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించిన సి.బి.ఎఫ్.సి. అధికారులు ఇప్పుడు రివైజింగ్ కమిటీకి సినిమాను రిఫర్ చేయడంపై నిర్మాత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు.

Jana Nayagan Movie

దళపతి విజయ్ (Vijay) చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) కు కష్టాలు ఇంకా తీరనేలేదు. ఈ నెల 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల థియేటర్లలో ప్రదర్శనకు సిద్థమౌతుండగా, సెన్సార్ నుండి ఇంకా ఈ సర్టిఫికెట్ ఇష్యూ కాలేదు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ కె.వి.యన్. ప్రొడక్షన్ హౌస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో జస్టిస్ పి.టి. ఆషా బుధవారం ఈ కేసును విచారించడానికి అంగీకరించారు. ఈలోగా ఆమె సి.బి.ఎఫ్.సి. (CBFC) అధికారులను నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ఫిర్యాదు విషయమై విచారించారు.

అసలు కథ ఏమిటంటే...

విజయ్ ప్రస్తుతం పొలిటిక్స్ లోకి అడుగుపెట్టాడు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని ప్రారంభించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుండి పోటీ చేయడం కోసం పార్టీ ప్రచారాన్ని గట్టిగా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాబోతున్న 'జన నాయగన్' అతని చివరి సినిమా అనే ప్రచారం జరిగింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన 'భగవంత్ కేసరి' (Bhagawanth Kesari) లోని కోర్ పాయింట్ ను తీసుకుని, విజయ్ రాజకీయ పార్టీ సిద్ధాంతాలకు మద్దతుగా స్క్రిప్ట్ ను మార్చుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ, సామాజిక, కులపరమైన అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయని అంటున్నారు. దాంతో సెన్సార్ బృందం కొన్ని సన్నివేశాలను తొలగించడం, కొన్ని సంభాషణలను మ్యూచ్ చేయమని కోరుతూ యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకరించింది. 'జన నాయగన్' మేకర్స్ అందుకు అంగీకరించి, తుది కాపీని సి.బి.ఎఫ్.సి.కి సబ్మిట్ చేశారు. అయినా కూడా తమకు సర్టిఫికెట్ ఇవ్వలేదని, చివరి నిమిషంలో ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రికమండ్ చేస్తున్నామని సి.బి.ఎఫ్‌.సి. అధికారులు చెబుతున్నారని మేకర్స్ ఆరోపించారు. ఈ విషయమై వారు కోర్టు కెక్కారు.


'జన నాయకన్' నిర్మాతలు చెబుతున్న ప్రకారం వారు డిసెంబర్ 18, 2025లో సెన్సార్ కు అప్లయ్ చేశారు. డిసెంబర్ 22న ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు కొన్ని సవరణలతో దీనికి యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. వారు చెప్పినట్టుగా సవరించిన కాపీని నిర్మాతలు డిసెంబర్ 24న అందించారు. ఈ కాపీని సెన్సార్ బృందం డిసెంబర్ 29న వెరిఫై చేసింది. అయితే జనవరి 5న సెన్సార్ కార్యాలయం నుండి ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి రిఫర్ చేస్తున్నట్టుగా ఈ-మెయిల్ వచ్చిందని నిర్మాతలు చెబుతున్నారు. ఒకసారి సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి, యు/ఎ 16 ప్లస్ సర్టిఫికెట్ ఇస్తున్నామని చెప్పిన తర్వాత మళ్ళీ ఎలా ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారని సదరు నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా విడుదల వాయిదా అయితే తమకు భారీ నష్టం వాటిల్లుతుందని వారు మద్రాస్ హైకోర్ట్ లో విన్నవించుకున్నారు. మరి బుధవారం విచారణలో జడ్జి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తారో చూడాలి.

Updated Date - Jan 07 , 2026 | 11:05 AM