విజయ్ ఆఖరి చిత్రానికి ఇన్ని కష్టాలా..!
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:17 PM
విజయ్ దళపతి నటించిన జననాయగన్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ మేకర్స్ ఊరిస్తున్నారు తప్ప పక్కా రిలీజ్ డేట్ ను చెప్పడం లేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశపడుతున్నారు.
కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం.. బాక్సాఫీస్ రికార్డుల రారాజు.. ఇళయదళపతి విజయ్ నటిస్తున్న ఆఖరి చిత్రం 'జననాయగన్'. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ సినిమా రంగానికి వీడ్కోలు పలుకుతున్న వేళ, తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా ఇది తెరకెక్కింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా చుట్టూ వినిపిస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే సంక్రాంతి సీజన్‌ను మిస్ చేసుకున్న ఈ చిత్రం అతి పెద్ద సీజన్ అయిన సమ్మర్ సీజన్‌ను కూడా మిస్ చేసుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
హెచ్. వినోద్ దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు, తెలుగులో సూపర్ హిట్ అయిన బాలకృష్ణ భగవంత్ కేసరి రీమేక్‌గా రావడం మరో హైలెట్. పూజా హెగ్డే హీరోయిన్‌గా, మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ క్రేజ్ రెట్టింపు అయింది. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు వస్తున్న లాస్ట్ ఫిలిం కావడంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, టెక్నికల్ ఇబ్బందుల వల్ల సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి మూడు నెలలు గడిచినా రిలీజ్ ఊసే లేదు. దీనితో పాటు ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని వార్తలు వచ్చినా, మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం అభిమానులను గందరగోళంలోకి నెట్టేసింది.
దళపతి ఫ్యాన్స్ అంతా కనీసం వేసవి సెలవుల్లో అయినా తమ హీరోను వెండితెరపై చూస్తామని ఆశపడ్డారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సమ్మర్ సీజన్‌ను కూడా జననాయగన్ మిస్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ సినిమాను జులై నెలకు పోస్ట్‌పోన్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జులై వరకు వాయిదా పడితే అభిమానుల నిరీక్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో కేవలం జననాయగన్ మాత్రమే కాదు, మరో భారీ చిత్రం టాక్సిక్ కూడా ఉంది. అయితే టాక్సిక్ సినిమా కూడా మార్చి 19 నుండి జూన్ 4 కు వాయిదా పడింది.
ఇలా ఒకే బ్యానర్ నుండి వస్తున్న రెండు పెద్ద సినిమాలు వరుసగా వాయిదా పడటంతో నిర్మాతలు పీకల్లోతు కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాల వడ్డీలు, బిజినెస్ లెక్కలు మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారాయి. విజయ్ రాజకీయ పార్టీ పనుల్లో బిజీగా ఉండటం, మరోవైపు సెన్సార్ క్లియరెన్స్ ఆలస్య అవ్వడం ఇలా అన్ని కారణాలు కలిసి జననాయగన్ రిలీజ్‌ను ఆలస్యం చేస్తున్నాయి. మరి జులై నెలలో అయినా ఈ జననాయకుడు బాక్సాఫీస్ ముందుకు వస్తాడా..? లేదా మళ్ళీ వాయిదా పడుతుందా..? అనేది వేచి చూడాలి.
Read Also: హోంబలేతో తెగిపోయిన బంధం...
Read Also: అన్న హీరో, చెల్లి ప్రొడ్యూసర్, బాబాయ్ క్లాప్!