బిచ్చ‌గాడు కాంబో.. వంద దేవుళ్ళు!

ABN , Publish Date - Mar 21 , 2026 | 12:24 PM

'బిచ్చ‌గాడు' వంటి బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత దర్శకుడు శశి, హీరో విజయ్‌ ఆంటోనీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి 'వంద దేవుళ్ళు' అనే పేరు ఖరారు చేశారు.

Vanda Devullu

‘పిచ్కైకారన్‌’ (బిచ్చ‌గాడు) వంటి బ్లాక్‌బస్టర్‌ విజయం తర్వాత దర్శకుడు శశి, మల్టీ టాలెంటెడ్, హీరో విజయ్‌ ఆంటోనీ (Vijay Antony) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రానికి ‘నూరు సామి’ (Noorusaami) తెలుగులో 'వంద దేవుళ్ళు' (Vanda Devullu) అనే పేరు ఖరారు చేశారు. అంత‌కు ముందు వీరి కాంబోలో వ‌చ్చిన ‘బిచ్చగాడు’ చిత్రం ఎన్ని రికార్డుల్ని క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి సినిమా చేస్తుండ‌డంతో అంచ‌నాలు హై లెవ‌ల్‌లో ఉన్నాయి. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ దిషాన్‌, కరుణాస్‌, లిజో మోల్‌ జోస్‌, కావ్య, శక్తి, పద్మిని, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవ‌ల‌ ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని డైనమిక్ స్టార్ విష్ణు మంచు ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఎంతో ఇంటెన్స్‌గా కనిపిస్తోంది. చెరుకు తోటలో విజయ్ ఆంటోనీ కత్తి పట్టుకున్న తీరు, వెనకాలే స్వాసిక మాసీ లుక్ అదిరిపోయింది. మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసి చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ‘రక్తం, చెమట, బంధంతో కూడిన ప్రయాణం. ఇదే మనం జీవించే జీవితం’ అంటూ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేసిన తర్వాత విజయ్‌ ఆంటోనీ ట్వీట్‌ చేశారు.

HD25EqfboAUq7HW.jfif

ఇదిలాఉంటే.. చెరకు రైతుల జీవితాన్ని ప్రధాన కథాంశంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సింగిల్‌ షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేసి, తాజాగా మూవీ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు. వేసవి సెలవుల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. ‘పూ’ సినిమా తర్వాత దర్శకుడు శశి రూపొందించిన గ్రామీణ నేపథ్యంతో కూడిన చిత్రం ఇది. ఇందులో చెరకుకు సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో చక్కెర కర్మాగారాలకు చౌక ధరకే విక్రయించాల్సిన పరిస్థితి, చక్కెర ఫ్యాక్టరీల, కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యాన్ని వివరించేలా చిత్రం స్క్రీన్‌ప్లే సాగుతుందని దర్శకుడు శశి చెప్పారు. ఇందులో చెరకు రైతుగా విజయ్‌ ఆంటోనీ, ఆయన భార్యగా శ్వాసిక నటించారు. ఈ మూవీకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేస్తున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 10:40 AM