విఘ్నేష్ శివన్ : ధనుష్ స్నేహాన్ని కోల్పోవడం బాధగా ఉంది
ABN , Publish Date - Apr 07 , 2026 | 10:48 AM
స్టార్ హీరో ధనుష్ తో స్నేహ బంధం కోల్పోవడం చాలా బాధగా ఉందని ప్రముఖ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ అభిప్రాయపడ్డారు.
స్టార్ హీరో ధనుష్ తో (Dhanush) స్నేహ బంధం కోల్పోవడం చాలా బాధగా ఉందని ప్రముఖ దర్శక నిర్మాత విఘ్నేష్ శివన్ (vignesh Shivan) అభిప్రాయపడ్డారు. ప్రదీప్ రంగనాథన్ హీరోగా విఘ్నేష్ శివన్ రూపొందించిన ‘ఎల్.ఐ.కె’. మూవీ ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ, ‘నాకు ధనుష్ అంటే చాలా ఇష్టం. అతన్ని ఒక నటుడిగా కంటే గొప్ప వ్యక్తిగా చూస్తాను. ఎందుకంటే, ధనుష్ పుట్టిన రోజు జూలై 28... అదే రోజు మా నాన్నగారు చనిపోయారు. అందుకే అతనిపై నాకు చాలా ప్రేమ ఉంది. కొన్ని విషయాలు ఎందుకు, ఎలా జరిగాయో నాకు తెలియదు. ఏదిఏమైనా ధనుష్ స్నేహాన్ని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఇది అతి పెద్ద నష్టంగా భావిస్తున్నాను. నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం ధనుష్. ‘వీఐపీ’ సినిమా కోసం రెండేళ్ళపాటు ధనుష్ తో కలిసేవున్నాను. సరైన కారణంతో విడిపోతే సరిదిద్దుకోవచ్చు. కానీ, ఎలాంటి కారణం లేకుండా విడిపోతే ఏం చేయగలం. ధనుష్ పట్ల నాకు చాలా ప్రేమ, గౌరవం, కృతజ్ఞత ఉన్నాయి. నా చివరి శ్వాస వరకు అవి నిలిచే ఉంటాయని నాకు మాత్రమే తెలుసు’ అని పేర్కొన్నారు.