సాహు గారపాటి మూవీ తెలుగులో...
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:09 PM
కేవలం 13 రోజుల్లో రూ. 175 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిన 'వాలా 2' సినిమా ఈ నెల 24న తెలుగులో విడుదల కాబోతోంది. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌కు సాహు గారపాటి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.
విషు పండగను పురస్కరించుకుని మలయాళ చిత్రం 'పళ్ళి చట్టంబి' ఏప్రిల్ 15న విడుదలైంది. ఈ సినిమాను అదే పేరుతో శుక్రవారం, 17వ తేదీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టొవినో థామస్ ఇందులో కథానాయకుడిగా నటించాడు. విశేషం ఏమంటే... ఇదే ఏప్రిల్ ద్వితీయార్థంలో మరో మలయాళ చిత్రం తెలుగులో విడుదల కాబోతోంది. అదే 'వాలా 2'. ఈ సినిమా మలయాళంలో ఏప్రిల్ 2న విడుదలైంది. మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న 'వాలా 2' 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 176 కోట్ల గ్రాస్‌ను వసులూ చేసింది. ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా కేవలం 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా... ఈ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని ఎవ్వరూ ఊహించలేదు.
'వాలా 2' సినిమాకు తెలుగు వాడైన సాహు గారపాటి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ సినిమాకు మలయాళీలు బ్రహ్మరథం పట్టారో అప్పుడే ఆయన దీనిని తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే 'వాలా 2' మూవీని తెలుగులో ఈ నెల 24న విడుదల చేస్తున్నారు. కాకపోతే మలయాళ పేరును అలానే ఉంచేశారు. మొన్న 'పళ్ళి చట్టంబి' అనే పదానికి అర్థం తెలియక జుత్తు పీక్కుని తెలుగు అర్థం కోసం ఎ.ఐ.ను ఆశ్రయించిన సినీ అభిమానులు... ఇప్పుడు మలయాళ పదం 'వాలా' అర్థం తెలుసుకోవడానికీ అదే పని చేస్తుండవచ్చు! తెలుగు నిర్మాత అయిన సాహు గారపాటి, మలయాళంలో తీసిన తన సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నప్పుడు తెలుగు పేరు పెట్టి ఉంటే బాగుండేదని భాషాభిమానులు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.