Ilaiyaraaja: నా సంగీతం విని.. కడుపులో బిడ్డ ప్రాణం పోసుకుంది
ABN , Publish Date - Sep 09 , 2026 | 07:51 AM
'నాలో సంగీత జీవశక్తి ప్రవహిస్తోంది. అది ఇంతకుముందెన్నడూ ఎవరికీ రాలేదు. మళ్ళీరాదు దీన్ని నేను గర్వంగానే చెప్పాలి' అని ప్రముఖ సంగీత దర్శకుడు 'ఇసెజ్జాని' ఇళయరాజా అన్నారు.
'నాలో సంగీత జీవశక్తి ప్రవహిస్తోంది. అది ఇంతకుముందెన్నడూ ఎవరికీ రాలేదు. మళ్ళీరాదు. ఈ విషయాన్ని గర్వంగా చెబుతున్నానని మీరు అనుకోవచ్చు.. కానీ దీన్ని నేను గర్వంగానే చెప్పాలి' అని ప్రముఖ సంగీత దర్శకుడు, 'ఇసెజ్జాని' ఇళయరాజా (Ilaiyaraaja) అన్నారు. మారి సెల్వరాజ్ (Mari Selvaraj) దర్శకత్వంలో మంజణతి (Manjanathi) చిత్రం షూటింగ్ తాజాగా తేని సమీపంలో ప్రారంభం కాగా, ఇందులో ఇళయ రాజా పాల్గొని చిత్రీకరణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మీరందరూ అడవుల్లో పుట్టామని చెబుతుంటారు. నేను కూడా ఇక్కడే పుట్టాను. నేను ఇలాగే, ఇంకొంచెం ముందుకు వెళితే మా ఇంటికి చేరుకుంటాను. అడవుల్లో, పొదల్లో పెరిగాను. అక్కడ నుంచి ఎలాగోలా సంగీతం నేర్చుకుని ముందుకుసాగాను. నాకు సంగీతం నేర్పిం చడానికి నా చుట్టూ ఎవరూ లేరు. ఒకరకమైన తృష్ణతో నేనే స్వయంగా సంగీతం నేర్చుకున్నాను. ప్రపంచంలోని గొప్ప మేధావులందరూ పియానో చూస్తూ, నేర్చుకుంటూ పెరిగారు.
కానీ, నేను 27 యేళ్ళ వయసు వచ్చే వరకు పియానో చూడలేదు. అలాగని నేను అందరికంటే గొప్పవాడినని చెప్పను. కానీ, సంగీతం నా వద్దకు అలా వచ్చింది. నాలో సంగీత జీవశక్తి ప్రవహిస్తోంది. అది ఇంతకుముందెన్నడూ ఎవరికీ రాలేదు. మళ్ళీ రాదు. జర్మనీలో ఒక గర్భిణి కడుపులో అచేతనంగా పడివున్న బిడ్డ నా సంగీతం విని తిరిగి ప్రాణం పోసుకుంది. ఇది కల్పితం కాదు. నిజమైన సంఘటన. ఈ విషయంలో నాకు గర్వం ఏమీలేదు. సంగీతం అందించడం నా వృత్తి. ఆ శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. నేను దాన్ని చేస్తు న్నాను' అని పేర్కొన్నారు.