షాకింగ్.. కేబుల్ టీవీల్లో 'జననాయగన్' చిత్రం ప్రసారం
ABN , Publish Date - Apr 14 , 2026 | 07:49 AM
తమిళనాడు కోయంబత్తూర్ జిల్లాలో స్థానిక కేబుల్ టీవీ ఛానల్లో జననాయగన్ చిత్రం ప్రసారం కలకలం రేపింది.
తమిళనాడు కోయంబత్తూర్ (Coimbatore) జిల్లాలో స్థానిక కేబుల్ టీవీ ఛానల్లో జననాయగన్ (Jana Nayagan) చిత్రం ప్రసారం కలకలం రేపింది. నటుడు విజయ్ ( Vijay) రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన చివరిగా నటించిన చిత్రం జననాయగన్ (Jana Nayagan). ఈ సంవత్సరం పొంగల్ పండుగ సందర్భంగా విడుదల అవ్వాల్సి ఉండగా. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ అందించడంలో ఇబ్బందులు చోటుచేసుకున్నాయి.
ఈ వ్యవహారం కోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో ఈనెల 10వ తేదిన 'జననాయగన్' చిత్రం అనూహ్యంగా ఇంటర్నెట్‌లో విడుదల కావడంతో చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి చెందింది. ఈ వ్యవహారాన్ని నటులు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి సహా పలువురు ఖండించారు. ఈ నేపథ్యంలో ఆరుగురిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు సుమారు 100కు పైగా వెబ్సైట్లను స్తంభింపజేశారు.
ఇదిలాఉండగానే.. శనివారం కోయంబత్తూర్ జిల్లా కరుమతంపట్టి, సూలూరు, పల్లపా ళయం, అవినాశి, తిరుప్పూర్ సహా పలు ప్రాంతాల్లో స్థానిక కేబుల్ టీవీ చానళ్లలో 'జననాయగన్ చిత్రం ప్రసారం కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతలు ఆయా కేబుల్ టీవీ కార్యాలయాలకు వెళ్లి చిత్ర ప్రసారం నిలిపివేయించారు.
కానీ ఈలోపే రెండు గంటల చిత్రం ప్రసారమైంది. ఈ విషయమై టీవీకే నేతల ఫిర్యాదుతో కేబుల్ టీవీ నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే సినిమా లీక్ విషయంలో తలలు పట్టుకున్న మూవీ మేకర్స్ ఇప్పుడు ఏ సమయంలో ఎక్కడా, ఇంకా ఎన్ని కేటుల్ టీవీల్లో ప్రదర్శిస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.