Trisha: ప్రేమ.. ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది!

ABN , Publish Date - May 24 , 2026 | 06:53 AM

తెరపై విజయ్‌, త్రిష జంట అంటే ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణే. ఎన్నో బ్లాక్‌బస్టర్‌లతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన ఈ జంట, ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

Trisha

తెర మీద విజయ్ (Vijay), త్రిష (Trisha)లది హిట్‌ పెయిర్‌.. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్‌ విజయ్‌ ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంలోనూ ఆమెపైనే ఫోకస్‌. ప్రస్తుతం సోషల్‌మీడియాలో త్రిష హవా నడుస్తోంది. వివిధ సందర్భాల్లో విజయ్‌ గురించి ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలివి..

ఒకే వాక్యం... వైరల్‌...

విజయ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సాయంత్రం ‘ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తం అవుతుంది’ అంటూ నెట్టింట త్రిష పెట్టిన ఒక పోస్ట్‌ వైరల్‌ అయింది. దానిపై సోషల్‌ మీడియాలో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు నెటిజన్లు.

మౌనంతో చికాకు...

మొదట్లో విజయ్‌తో తనకు పెద్దగా మాటలు లేవని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. దీనికి కారణం విజయ్‌ సెట్స్‌లో ఎక్కువగా మౌనంగా ఉండడమేనట. దానివల్ల కొన్నిసార్లు ఆయనతో నటించాలంటేనే చికాకు కలిగేదని త్రిషనే స్వయంగా చెప్పింది. అయితే విజయ్‌ మొదటి నుంచి కాస్త బిడియస్తుడే అనే విషయం తెలిసిందే.

నాటి మాటలే నిజమయ్యాయి...

త్రిష కృష్ణన్‌ కెరీర్‌ మొదట్లో... అంటే 2004లో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘తనకు తమిళనాడు సీఎం కావాలనుంది’ అన్నది. అంతేకాదు.. ‘పదేళ్లలో కచ్చితంగా రాజకీయ మార్పు గమనిస్తార’ని ఆరోజు నవ్వుతూ అన్న మాటలు 22 ఏళ్ల తర్వాత నిజమయ్యాయి. తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా కొత్త పార్టీ, కొత్త సీఎంని చూస్తున్నారు.

సుదీర్ఘ ప్రయాణం...

‘లియో’ సినిమా షూటింగ్‌ సందర్భంగా విజయ్‌ని తనకు భద్రతను ఇచ్చే వ్యక్తిగా అభివర్ణించింది త్రిష. విజయ్‌ని కలిసిన ప్రతీసారి ఒక స్కూల్‌ ఫ్రెండ్‌లా ఫీలవుతుందట. ఆయనతో నటిస్తే సౌకర్యం, ప్రేమ, స్నేహం ఉంటాయని చెప్పింది. తన 20 ఏళ్ల కెరీర్‌లో ఒక నటుడితో సుదీర్ఘ ప్రయాణమంటే అది విజయ్‌తోనేనట. సరిగ్గా రెండేళ్ల క్రితం విజయ్‌ పుట్టిన రోజున ఒక అందమైన ఫొటోను అప్‌లోడ్‌ చేసింది త్రిష. అక్కడ ‘హ్యాపీ బర్త్‌డే బెస్టెస్ట్‌’ అని రాసింది.

తుపానులా..

తమిళనాడు ఎన్నికలకు కొన్ని నెలల ముందు త్రిష ‘ప్రశాంతత నుంచి తుపానుగా, తుపాను తర్వాత ప్రశాంతతలా మరెన్నో మైలురాళ్లు నీ ముందున్నాయి’ అంటూ విజయ్‌ని ఉద్దేశించి ఒక పోస్ట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది.

హిట్‌ కాంబినేషన్‌

2004లో ‘గిల్లి’ వీరిద్దరి మొదటి సినిమా. ఆ తర్వాత వరుసగా 2005లో ‘తిరుపాచి’, 2006లో ‘ఆది’, 2008లో ‘కురువి’ సినిమాలు చేశారు. ఆ తర్వాత సుమారు 14 ఏళ్లకు అంటే.. 2023లో ఈ జంట ‘లియో’తో తెరపై హిట్‌పెయిర్‌గా నిలిచింది. విశేషం ఏమిటంటే.. ఈ ఐదు సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌డూపర్‌ హిట్‌లే.

ఎక్కువ ఇష్టపడే వ్యక్తి

‘విజయ్‌ అద్భుతమైన సహనటుడు. అతను నాకెప్పుడూ ప్రత్యేకమే. మేమిద్దరం ఇప్పటికే ఎన్నో బిగ్గెస్ట్‌ హిట్స్‌ చూశాం. విజయ్‌ కోపంగా ఉండటం నేను ఏనాడూ చూడలేదు. సెట్‌లో చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. తన పని తాను చేసుకొనే తత్వం ఆయనది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే... నేను ఎక్కువ ఇష్టపడే వ్యక్తుల్లో ఆయన ఒకరు.’

Updated Date - May 24 , 2026 | 06:53 AM