ఈ గ్రంథ రచయిత్రి.. త్రిష విజయ్!చెన్నైలో మెగా కుంభకోణం
ABN , Publish Date - Nov 08 , 2026 | 06:59 AM
తమిళనాడులోని పెరియార్ జ్ఞాన గ్రంథాలయంలో పుస్తకాల కొనుగోలుపై భారీ వివాదం చెలరేగింది. అందులో విజయ్ త్రిష పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
తమిళనాడులోని పెరియార్ జ్ఞాన గ్రంథాలయంలో పుస్తకాల కొనుగోలుపై భారీ వివాదం చెలరేగింది. నకిలీ ప్రచురణ సంస్థలు, ఏఐతో తయారైన పుస్తకాలు, కల్పిత రచయితల పేర్లతో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో ఇప్పుడు అక్కడ పెద్ద రాజకీయ దుమారం రేపుతోంది. నకిలీ రచయితలు.. దొంగ ప్రచురణకర్తలు. కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో తయారైన పుస్తకాలు! తమిళనాడు (Tamil Nadu) లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పెరియార్ జ్ఞాన గ్రంథాలయంలో (Periyar Library) చోటుచేసుకున్న మెగా కుంభ కోణం తీరు ఇదీ లైబ్రరీకి అందిన గ్రంథాలు, వాటి ప్రచురణ సంస్థల పట్ల రచయిత పెరుమాళ్ మురుగన్ (Perumal Murugan) సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ కుంభకోణం బయటకు వచ్చింది.
పెరుమాళ్ మురుగన్ ఈ గ్రంథాలయ పుస్తక ఎంపిక కమిటీలో సభ్యుడు. ఆయన ఇటీవల 'చిందై' అనే వెబ్‌సైట్‌కు రాసిన వ్యాసంలో.. అగల్ విలక్కు అనే సంస్థ నుంచి పెరియార్ లైబ్రరీ కోసం అధిక పుస్తకాలు సేకరించారని, ఆ పబ్లిషర్ కోసం ప్రయత్నించగా, అది నకిలీ సంస్థ అని తేలిందని సంచలన ఆరోపణలు చేశారు. అనేక పుస్తకాలను ఏఐ కంటెంట్‌తో రూపొందించారని, వాటిపై ఊహాజనితమైన, కల్పిత పేర్లను రచయితలుగా ముద్రించారని చెప్పారు. అందులో, తమిళ భాష చరిత్రకు సంబంధించిన ఓ పుస్తక రచయిత్రిగా త్రిష విజయ్ (Trisha Vijay) అనే పేరు కూడా ఉంది.
అంతేకాకుండా విజయా బాలు, జ్యోతి శరవణన్, మనీషా దినేశ్ ఇలా చిత్రవిచిత్రమైన పేర్లను రచయితలుగా పెట్టి పుస్తకాలను ముద్రించారు. రూ.200-రూ.300 రేటు ఉండే పుస్తకాలకు ఏకంగా రూ.1200-1500 పెట్టారని, అదే రేటుకు లైబ్రరీ కోసం కొనుగోలు చేయడం అనుమానాలకు తావిస్తోందని మురుగన్ అన్నారు. నిజానికి ఈ లైబ్రరీ నిర్మాణం గత డీఎంకే (DMK) ప్రభుత్వంలోనే పూర్తైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన విజయ్ (Vijay) ఇటీవలే ప్రారంభించారు. దీంతో, లైబ్రరీ వివాదం విషయంలో ఆ రెండు పార్టీలూ పరస్పరం బురద జల్లుకుంటున్నాయి. వివాదం రేగిన కొద్ది గంటల్లోపే సీఎం విజయ్ స్పందించారు.
'పెరి యార్ పేరును ఉపయోగించుకుని అవినీతి అక్రమాలకు పాల్పడటం డీఎంకేకు కొత్త కాదు. పెరియార్ లైబ్రరీ పుస్తకాల కొనుగోలులో జరిగిన మెగా కుంభ కోణంతో ఇక ఆ పార్టీ ప్రజల ముందు శాశ్వతంగా తలదించుకోవాల్సిందే" అన్నారు. ఆ గ్రంథాలయానికి 60వేలకు పైగా పుస్తకాలను కొనుగోలు చేసింది డీఎంకే ప్రభుత్వమేనన్నారు. తన ప్రభుత్వం వచ్చాక ఒక్క పుస్తకమూ సేకరించలేదన్నారు. మరోవైపు, నకిలీ ప్రచురణ సంస్థల పుస్తకాలపై జూన్ నెల ముద్రలు ఉండటాన్ని బట్టి వాటిని ప్రస్తుత ప్రభు త్వమే కొన్నట్లు ఉందని డీఎంకే మండిపడింది. పుస్తక రచయిత పేర్లు త్రిష విజయ్ అంటూ ఉండటాన్ని ఎత్తి చూపింది.