త్రిష పేరుతో సేవా సంస్థ.. జయలలిత వారసురాలిగా ప్రకటన
ABN , Publish Date - Nov 24 , 2026 | 08:06 AM
నటి త్రిష పేరుతో తిరునల్వేలిలో 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై' సేవా సంస్థ ప్రారంభమైంది. త్రిషను జయలలిత రాజకీయ వారసురాలిగా భావిస్తున్నామని నిర్వాహకుడు రాజగోపాల్ ప్రకటించారు.
సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి త్రిష (Trisha) పేరు ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే సీఎం విజయ్‌తో సంబంధం వంటి అంశాలతో నిత్యం వార్తలల్లో నిలుస్తున్న ఆమె పేరుతో తమిళనాడులో ఓ కొత్త సేవా సంస్థ ప్రారంభం కావడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నాయకురాలు జయలలితతో త్రిషను పోలుస్తూ, ఆమెను జయలలిత రాజకీయ వారసురాలిగా భావిస్తున్నామని సంస్థ నిర్వాహకులు ప్రకటించడం మరింత చర్చకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలిలో 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై' (యువ విప్లవ నాయకి త్రిష సేవా సంస్థ) పేరుతో కొత్త సంఘం (Trisha Seva Sangam) ఏర్పాటైంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడిగా చెప్పుకుంటున్న రాజగోపాల్ తాజాగా సంఘం లోగోను ఆవిష్కరించారు. అలాగే నూతనంగా నియమించిన నిర్వాహకులను మీడియాకు పరిచయం చేశారు. ఈ సంఘం లోగోపై 'పదవుల కోసం కాదు.. తమిళ ప్రజల హక్కుల కోసం!' అనే నినాదాన్ని పొందుపరిచారు. దీంతో ఈ సంస్థ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలు, భవిష్యత్తు కార్యాచరణపై ఆసక్తి నెలకొంది.
సంస్థ ప్రారంభం సందర్భంగా రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ త్రిష వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమర్థవంతమైన పాలన అందించారని, ఆమెలాగే త్రిష కూడా మంచి వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు కలిగినవారని అభిప్రాయపడ్డారు. త్రిష రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం ఎన్నో మంచి పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాము త్రిషను జయలలిత ( Jayalalithaa Political Legacy) రాజకీయ వారసురాలిగా భావిస్తున్నామని రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ ఆలోచనతోనే ఆమె పేరుతో 'ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవైసను (Ilaya Puratchi Thalaivi Trisha Peravai) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి తీసుకున్నారా? ఆమెకు ఈ సంఘంతో ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. (Trisha Fans Association)
ఈ పేరవై కేవలం అభిమాన సంఘంగా కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వేదికగా పనిచేస్తుందని రాజగోపాల్ ఈ సందర్భంగా తెలిపారు. తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రజలకు క్షేత్రస్థాయిలో చేరేలా తమ సంఘం తరఫున చర్యలు తీసుకుంటామని వివరించారు.
ప్రజల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగస్వామ్యం కావడమే తమ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే త్రిష రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆమె పేరుతో సేవా సంస్థ ఏర్పాటైన నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) కొత్త చర్చ మొదలైంది. ఈ పరిణామంపై త్రిష ఎలా స్పందిస్తారో చూడాలి.