ఎంజీఆర్ బయోపిక్.. జయల‌లిత‌గా త్రిష?

ABN , Publish Date - Oct 14 , 2026 | 07:48 AM

ఎంజీఆర్ జీవితకథ ఆధారంగా బయోపిక్‌ను తెరకెక్కించేందుకు జేఎం బషీర్ సిద్ధమయ్యారు. ఇందులో దివంగత జయలలిత పాత్ర కోసం హీరోయిన్ త్రిషను సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు.

trisha

తాను హీరోగా రూపొందించే పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీఆర్ బయోపిక్ (MGR Biopic) మూవీలో దివంగత జయలలిత (Jayalalithaa) పాత్ర కోసం ప్రముఖ హీరోయిన్ త్రిష (Trisha) ను సంప్రదిస్తున్నట్టు దర్శక నిర్మాత, నటుడు జె.ఎం.బ‌షీర్ (J.M. Bashir) వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. "పసుంపొన్ ముత్తురామలింగ దేవర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన 'పసుంపొన్ దేవర్' మూవీకి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించింది. ఇపుడు పురట్చితలైవర్ డాక్టర్ ఎంజీఆర్ బయోపిక్ శ్రీకారం చుట్టాను. ఈ నెల 17వ తేదీ నుంచి రామనాథపురంలో చిత్రీకరణ ప్రారంభం కానుంది అన్నారు.

ఎంజీఆర్ యవ్వనం, సినిమా, రాజకీయాలు వంటి అనేక విషయాలు అందులో ఉంటాయి. దర్శకుడు, సంగీత దర్శకుడి పేర్లను త్వరలోనే వెల్లడిస్తాం. ఇందులో ఎంజీ ఆర్ పాత్ర పోషిస్తున్నాను. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ముఖ్యంగా ఈ మూవీలో దివంగత జయలలిత పాత్ర కోసం హీరోయిన్ త్రిషను ఎంపిక చేసేందుకు ఆమెను సంప్రదిస్తున్నాం అన్నారు. నా కుమార్తె, త్రిష మంచి స్నేహితులు. ఇపుడు వీరిద్దరు కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. జయలలిత పాత్రను త్రిష పోషిస్తే చాలా బాగుంటుంది.

మూవీలో అన్నాదురై, క‌రుణానిధి పాత్ర‌లు కూడా ఉన్నాయి. ఆయా పాత్రలకు నటుల ఎంపిక జరగాల్సివుంది. నేను అన్నాడీఎంకే, డీఎంకేలో ఉన్నాను. ఇపుడు టీవీకేలో చేరాను. అందువల్ల ఎంజీఆర్ బయోపిక్ తీసేందుకు నాకు ఎలాంటి అడ్డంకులు లేవు. ముఖ్యమంత్రి విజయ్ పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది. భవిష్యత్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపడుతారు' అని జేఎం బషీర్ పేర్కొన్నారు.

Updated Date - Oct 14 , 2026 | 07:56 AM