ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి సూసైడ్
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:34 PM
వర్ధమాన టీవీ, సినీ నటి సుభాషిణి ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. వర్ధమాన టీవీ, సినీ నటి సుభాషిణి బాల సుబ్రహ్మణ్యం (36) (Subashini) చెన్నై పోరూరులోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల భర్తతో తలెత్తిన విభేదాల కారణంగా సుభాషిణి బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానిక పోరూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆత్మహత్యకు ముందు సుభాషిణి తన భర్తకు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం.. తన గదిలోకి వెళ్లి సుభాషిణి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. సుభాషిణి మృతిపై ఆమె భర్తకు సమాచారం అందించారు. అతడిని సైతం పోలీసులు విచారిస్తున్నారు.
ఇదిలాఉంటే.. సన్ టీవీలో వచ్చే కాయల్ సీరియల్ (Kayal Serial) తో సుభాషిణి తమిళనాట విశేష గుర్తింపును పొందింది. అడపా దడపా సినిమాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే సుభాషిణికి ఇన్ స్టాలో 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఏప్రిల్12న శ్రీలంకకు చెందిన కుటుంబంలో జన్మించిన సుభాషిణి రెండేండ్ల క్రితం పిప్పిన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని బెంగళూరులో నివసిస్తున్నారు.

షూటింగ్స్ కారణంగా తరచూ ఆమె చెన్నైకు రావాల్సి ఉండటంతో ఇక్కడే ఓ అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌గా ఉంటూ భర్త దగ్గరకు రాక పోకలు సాగించేది. మరో ఆరు రోజుల్లో పుట్టిన రోజు, రెండు వారాల్లో మ్యారేజ్ సెకండ్ యానివర్శరీ ఉండగా ఇప్పుడు సుభాషిణి ఇలా సడన్‌గా ఆత్మహత్య చేసుకోవడం కుటుంబ సభ్యులను, సన్నిహితులను కలిచివేస్తోంది.