Tovino Thomas: వారెవ్వా... ఏమి టైటిల్...
ABN , Publish Date - Jan 21 , 2026 | 02:39 PM
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన తాజా చిత్రం 'పళ్ళి చట్టంబి'. ఈ పాన్ ఇండియా మూవీ మోషన్ పోస్టర్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) తెలుగువారికీ సుపరిచితుడే. అతను నటించిన పలు మలయాళ చిత్రాలు ఇప్పుడు తెలుగులో డబ్ అవుతున్నాయి. అంతే కాదు... అతను నటించిన చిత్రాలు ఒకేసారి అక్కడ ఇక్కడ కూడా విడుదల అవుతున్నాయి.
తాజాగా టొవినో థామస్ నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం 'పళ్ళి చట్టంబి' (Palli Chattambi) మోస్టర్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 9న వివిధ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ మూవీని వరల్డ్ వైడ్ ఫిలిమ్స్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. కయదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్ గా నటిస్తున్న 'పళ్ళి చట్టంబి'ని డిజో జోస్ ఆంటోనీ డైరెక్ట్ చేస్తున్నారు. 1950, 60 నాటి నేపథ్యంలో పీరియాడికల్ మూవీగా 'పళ్ళి చట్టంబి' రూపుదిద్దుకుంటోంది. గతంలో ఎప్పుడూ చూడని విధంగా టొవినో థామస్ ఈ చిత్రంలో కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు.
'పళ్ళి చట్టంబి' సినిమాను ఐదు భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని భాషల్లోనూ దీని టైటిల్ ను 'పళ్ళి చట్టంబి' అనే పెట్టారు. మలయాళంలో పళ్ళి చట్టంబి అంటే... ప్రార్థనా మందిరాలకు చెందిన రౌడీ అని అర్థం. ఓ రకంగా లోకల్ గూండా అనుకోవచ్చు. మరి సినిమా విడుదల సమయానికి ఈ టైటిల్ ను ఆయా భాషల్లో తర్జుమా చేసి పెడతారా... ఇదే పేరుతో రిలీజ్ చేస్తారా? అనేది వేచి చూడాలి. ఇందులో విజయ రాఘవన్, సుధీర్ కరమన, బాబురాజ్, వినోద్ కేదమంగళం, ప్రశాంత్ అలెగ్జాండర్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి టిజో టోమీ సినిమాటోగ్రాఫర్ కాగా జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చుతున్నాడు.