Nithya Menen: పిల్లల్ని కనడానికి.. పెళ్లికి ఏం సంబంధం
ABN , Publish Date - Apr 27 , 2026 | 04:03 PM
నటనలో జీవించడమే తప్ప, కృత్రిమమైన హొయలు పోవడం అస్సలు తెలియని నటి నటి నిత్యామీనన్.
గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న నటి నిత్యామీనన్ (Nithya Menen). నటనలో జీవించడమే తప్ప, కృత్రిమమైన హొయలు పోవడం ఆమెకు అస్సలు తెలియదు. అందుకే ఆమె చేసే సినిమాలు ఎంత డిఫరెంట్‌గా ఉంటాయో, ఆమె ఇచ్చే స్టేట్‌మెంట్స్ కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉంటాయి. తాజాగా పెళ్లి, పిల్లల విషయంలో నిత్యా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయాలకు, సామాజిక కట్టుబాట్లకు భిన్నంగా ఆమె వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
చైల్డ్ ఆర్టిస్ట్‌గానే వెండితెరకు పరిచయమై, తెలుగులోకి రాకముందే దాదాపు ఎనిమిది సినిమాల్లో నటించి మెప్పించింది ఈ మలయాళ ముద్దుగుమ్మ. అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి చిత్రంతోనే కుర్రకారు గుండెల్లో గంటలు కొట్టేసింది. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రల కంటే, నటనకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్‌నే ఎంచుకుంటూ స్లో అండ్ స్టడీగా దూసుకుపోతోంది. ఆమె స్క్రీన్ మీద ఉంటే ఆ కళే వేరు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిత్యా మాట్లాడిన మాటలు వింటే.. ఆమె ఎంత బోల్డ్ అండ్ క్లారిటీ ఉన్న పర్సనో అర్థమవుతుంది.
సినిమాలు తగ్గిన టైంలో సాధారణంగా హీరోయిన్లకు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైతే ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేస్తుంటారు. కానీ నిత్యా మాత్రం ఈ విషయాన్ని చాలా లోతుగా విశ్లేషించింది. పిల్లల్ని కనడానికి పెళ్లితో సంబంధం లేదని ఆమె అభిప్రాయ పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పిల్లలు కావాలనుకోవడం అనేది పూర్తిగా ఒక వ్యక్తిగత నిర్ణయమని, దానికి వివాహం ఒక్కటే మార్గం కాదని ఆమె కుండబద్దలు కొట్టారు. ఒక ప్రాణానికి జన్మనివ్వాలనే కోరికను సామాజిక హోదాతో లేదా పెళ్లి అనే ముడితో కలపాల్సిన అవసరం లేదని చెప్పడం ఆమె ధైర్యానికి నిదర్శనం. ప్రతి ఒక్కరూ గుర్తించేలా ఆమె తన వ్యక్తిగత స్వేచ్ఛ గురించి గళం విప్పింది.
పెళ్లి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం తనపై ఎలాంటి కుటుంబ ఒత్తిడి లేదని, సోలో లైఫ్‌ను తాను పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్నానని నిత్యా వెల్లడించింది. పెళ్లి అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే అని, దానివల్ల కెరీర్ ముగిసిపోదని ఆమె నమ్ముతోంది. సమాజం ఏమనుకుంటుంది అనే దానికంటే, తన మనసుకి ఏది సరైనది అనిపిస్తుందో అదే చేస్తానని నిత్యా చెప్పిన మాటలు యువతలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాలు అలాగే వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ, తనకంటూ కొన్ని స్పష్టమైన హద్దులను గీసుకుని ముందుకు సాగుతోంది. నిత్యామీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు కొంతమందికి వివాదాస్పదంగా అనిపించినా, మరికొంతమంది మాత్రం ఆమెలోని నిజాయితీని మెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా నిత్యా ఎప్పుడూ ట్రెండ్‌ను ఫాలో అవ్వదు.. ట్రెండ్‌ను సెట్ చేస్తుంది.