కుల వివక్ష నేపథ్యంలో 'ది రైజ్ ఆఫ్ అశోక'
ABN , Publish Date - Feb 21 , 2026 | 04:46 PM
సతీశ్ నీనసాం, సప్తమి గౌడ జంటగా నటించిన సినిమా 'ది రైజ్ ఆఫ్ అశోక'. ఈ సినిమా ఇదే నెల 27న తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది.
సతీష్ నీనసాం కథానాయకుడిగా 'కాంతార' ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'ది రైజ్ ఆఫ్ అశోక'. కన్నడ, తెలుగు, తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వినోద్ వి. దుండలే తెరకెక్కించారు. వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో రవిశంకర్ పంపిణీ చేస్తున్నారు. ఈ మూవీ ఇదే నెల 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన తెలుగు ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సత్యదేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సత్యదేవ్ మాట్లాడుతూ, 'తెలుగు ప్రేక్షకులకు కన్నడ నుంచి వచ్చే రూటెడ్ మూవీస్ అంటే ఇష్టం. ఆ కోవకే చెందిన ఈ సినిమాను కూడా మన వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. నా 'జీబ్రా' మూవీ కన్నడలో విడుదలైనప్పుడు సతీష్, సప్తమి ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా దర్శకుడు వినోద్ షూటింగ్ సమయంలో మరణించారు. దాంతో సతీశ్ ఆ బాధ్యతలను భుజానకెత్తుకుని దీనిని పూర్తి చేశారు. హీరోయిన్ సప్తమి తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
హీరో సతీష్ మాట్లాడుతూ 'తెలుగు భాష అంటే నాకు ఎంతో గౌరవం. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సత్యదేవ్ మంచి మనసున్న మనిషి. తెలుగులో వస్తున్న 'ది రైజ్ ఆఫ్ అశోక' సినిమాను మీరంతా ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇది కేవలం కమర్షియల్ సినిమానే కాదు. ఎంతో డిఫరెంట్ ఫిలిమ్' అని చెప్పారు. సప్తమి గౌడ మాట్లాడుతూ, 'మూవీ ట్రైలర్ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. తెలుగు ప్రేక్షకుల సపోర్ట్ మాకు కావాలి. 'ది రైజ్ ఆఫ్ అశోక్' అనేది ఓ గ్రామం గురించి, ఓ కమ్యూనిటీ గురించిన కథ. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. తెలుగు నేటివిటికి కూడా దగ్గరగా ఉండే సినిమా. ఇందులో అంబిక అనే అమ్మాయి పాత్రలో నటించాను. ఈ సినిమాలో ఎంతో గొప్ప మేసేజ్ ఉంది' అని అన్నారు. కళా సృష్టి అధినేత రవిశంకర్ మాట్లాడుతూ, 'రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సాలోనూ ఈ సినిమాను తాము విడుదల చేస్తున్నామ'ని చెప్పారు.