Tollywood: టాప్ 20 రీ-రిలీజెస్ లోనూ 8 తెలుగు సినిమాలు

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:13 PM

ఆల్ ఇండియాలో టాప్ గ్రాసర్స్ గా వెలుగుతున్నాయి టాలీవుడ్ సినిమాలు. అయితే రీ-రిలీజెస్ లో తెలుగు చిత్రాలను తమిళ మూవీస్ అధిగమించాయట. అరె - అదెలా జరిగింది? అదే తాజా ఖబర్!

Tollywood Top Grosers

ఇప్పటి వరకూ తమిళ సినిమాలు ఒక్కటి కూడా వెయ్యి కోట్లు గ్రాస్ చూడలేకపోయింది. ఒకప్పుడు తెలుగు సినిమాల కంటే మిన్నగా ఉత్తరాదిన, జపాన్, శ్రీలంక, కొలంబియా వంటి దేశాల్లో తమిళ చిత్రాలే భలేగా సందడి చేశాయి. ఆ ఊపంతా ఇప్పుడు కనిపించడం లేదని టాలీవుడ్ జనం కోలీవుడ్ ను చూసి నవ్వుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక్కటంటే ఒక్క వెయ్యి కోట్ల సినిమా చూడాలని తమిళ సినీజనం చాలా రోజులుగా తంటాలు పడుతూనే ఉన్నారు. ఇండియాలోనే తొలి వెయ్యి కోట్ల సినిమాగా చరిత్ర కెక్కింది 2017లో రిలీజైన 'బాహుబలి- ద కంక్లూజన్' (Bahubali). ఆ తరువాత 'ట్రిపుల్ ఆర్ (RRR), కల్కి 2898 ఏడి (Kalki 2898 AD), పుష్ప-2 (Pushpa 2)' చిత్రాలు సైతం వెయ్యి కోట్ల క్లబ్ లో చోటు సంపాదించాయి. ఇంత చరిత్ర కలిగిన టాలీవుడ్ మూవీస్ ను రీ-రిలీజెస్ లో కోలీవుడ్ పిక్చర్స్ అధిగమించడం విశేషంగా మారింది. అదే ఇప్పుడు తమిళ తంబీలకు ఆనందం కలిగిస్తోన్న అంశం. అయినా 'బాహుబలి' సిరీస్ ఘనవిజయం మాత్రం యావత్ భారతీయ సినీ ఫ్యాన్స్‌ కు మరపురాని అంశంగా నిలచింది.


ఇంతకూ రీ-రిలీజెస్ లో టాలీవుడ్ సినిమాలను కోలీవుడ్ మూవీస్ ఎలా అధిగమించాయి? రీ-రిలీజెస్ టాప్ టెన్ జాబితా తీసుకుంటే అందులో నంబర్ వన్ ప్లేస్ లో మళ్ళీ మన తెలుగు సినిమానే ఉంది. గత సంవత్సరం రాజమౌళి తన రెండు 'బాహుబలి' చిత్రాలను కలిపి 'బాహుబలి- ది ఎపిక్'గా విడుదల చేయగా, ఆ సినిమా అనూహ్యంగా వసూళ్ళు రాబట్టింది. ఈ చిత్రం రిపీట్ రన్ లో 60 కోట్ల రూపాయల గ్రాస్ చూసింది. ఇక టాప్ టెన్ రీ-రిలీజెస్ లో చోటు దక్కించుకున్న మరో తెలుగు చిత్రం మహేశ్ బాబు 'ఖలేజా'నే! ఈ మూవీ రిపీట్ రన్ లో 12 కోట్ల రూపాయలు పోగేసింది. అయితే టాప్ గ్రాసింగ్ రీ-రిలీజెస్ లో మాత్రం మూడు తమిళ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. 2024 ఏప్రిల్ 20న రీ-రిలీజైన విజయ్ 'గిల్లీ' చిత్రం 26 కోట్ల గ్రాస్ చూసింది. ఈ నాటికీ రీ-రిలీజైన తమిళ చిత్రాల్లో ఈ సినిమాదే పైచేయిగా ఉంది. దీని తరువాత గత సంవత్సరం రజనీకాంత్ బర్త్ డే కానుకగా రిలీజైన 'పడయప్పా' చిత్రం 19 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ యేడాది జనవరి 23వ తేదీన అజిత్ కుమార్ 'మంగాత్త' రీ-రిలీజై 17.5 కోట్లు పోగేసింది. అలా మూడు తమిళ చిత్రాలు వసూళ్ళలో డబుల్ డిజిట్ సాధించాయి. మన తెలుగు సినిమాలు రెండే టాప్ టెన్ రీ-రిలీజెస్ లో ఉండడం గమనార్హం! ఆ తీరున టాలీవుడ్ మూవీస్ కంటే కోలీవుడ్ పిక్చర్స్ ఒక్క సినిమాతో పై చేయి సాధించడం నేడు విశేషంగా మారింది.


నీరు గారిన తమిళ తంబీల ఆనందం...

ఫస్ట్ రిలీజుల్లో తమ చిత్రాలు రికార్డులు సాధించక పోయినా, రీ -రిలీజ్ లో ఓ ఘనత సాధించాయని తమిళ తంబీలు ఆనందిస్తున్నారు. అయితే టాప్ 20 రీ-రిలీజెస్ ను తీసుకుంటే మళ్ళీ తెలుగువారిదే పైచేయి అనిపిస్తుంది. అందులో 'జల్సా, ఆర్య 2, మురారి, ఖుషి, సలార్, బిజినెస్ మేన్' వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. వీటితో కలిపి టాప్ 20 రీ-రిలీజెస్ లో తెలుగు చిత్రాలు మొత్తం ఎనిమిది ఉన్నాయి. తమిళ సినిమాలు కేవలం నాలుగు మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించాయి. మొత్తం టాప్ 20 రీ-రిలీజెస్ లో తెలుగు చిత్రాలదే మళ్ళీ పైచేయిగా కనిపిస్తోంది. ఈ జాబితాలో తెలుగు సినిమాలు 8, హిందీ చిత్రాలు 7, తమిళ మూవీస్ 4 ఉండగా ఒకే ఒక్క మళయాళ చిత్రం 'దేవదూతన్' 20వ స్థానంలో ఉంది. పాపం - తమిళ తంబీల ఆనందం ఆట్టే నిలవకుండా టాప్ 20లో అత్యధిక తెలుగు చిత్రాలు నిలవడం విశేషం!

Updated Date - Jan 29 , 2026 | 06:15 PM