ఇక నుంచి.. రోజుకు ఆరు షోలు! ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:21 AM

తమిళనాడులో కొత్త సినిమాల విడుదలైన తొలి ఏడు రోజుల పాటు రోజుకు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు సీఎం విజయ్ ప్రభుత్వం అనుమతించింది.

Theatres

  • నిర్మాతలు, ఎగ్జిబిటర్లకు ప్రభుత్వం తీపి కబురు..

  • కొత్త సినిమాలకు వెసులుబాటు

  • తొలి వారం రోజులు మాత్రమే

  • పండుగలు, వారాంతపు సెలవుల్లో కూడా

తమిళ చిత్రపరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం (Tamil Nadu Government) తీపి కబురు చెప్పింది. మరో నాలుగు రోజుల్లో దీపావళి (Diwali) పండుగ రానున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త సినిమాల విడుదలైన రోజు నుంచి వారం రోజుల పాటు ఆరు షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు సీఎం విజయ్ (Vijay) సారథ్యంలోని టీవీకే ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు తొలి ఆట ప్రారంభించి, అర్ధరాత్రి 2.30 గంటల వరకు మొత్తం ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. అలాగే, వారాంతపు సెలవు రోజులైన శని, ఆదివారాలతో ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా ఆరు షోలు (Six Shows for New Movies) ప్రదర్శించుకోవచ్చని తెలిపింది.

తమిళ్ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, తమిళనాడు థియేటర్ అండ్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 1957 నాటి తమిళనాడు సినిమా (రెగ్యులేషన్) నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో రోజుకు నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శిస్తున్నారు.

అయితే.. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కొత్త తమిళ సినిమాల విడుదలైన తేదీ నుంచి తొలి ఏడు రోజుల పాటు ఐదు సార్లు, శని, ఆదివారాలు, ప్రభుత్వ పండుగ సెలవుల్లో రోజుకు ఐదు ఆటలను ప్రదర్శించుకు నేందుకు అనుమతివ్వగా, ఇప్పుడు దానిని సవరించి ఒకపై కొత్త సినిమాల విడుదల తేదీ నుంచి వారం రోజుల పాటు రోజుకు ఆరు ఆటలను ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై న‌డిగర్ సంఘం, తమిళ సినీ నిర్మాతల సంఘాలు, తమిళ థియేటర్ మల్టీప్లెక్స్ సంఘం హర్షం వ్యక్తం చేశాయి.

Updated Date - Nov 04 , 2026 | 07:21 AM