ప్లాప్ డైరెక్టర్ కి ఓకే చెప్పిన యశ్.. ఇదేమవుతుందో
ABN , Publish Date - Oct 12 , 2026 | 09:16 PM
పాన్ ఇండియా స్థాయిలో కేజీఎఫ్ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన రాకింగ్ స్టార్ యశ్ (Yash)
పాన్ ఇండియా స్థాయిలో కేజీఎఫ్ సృష్టించిన సంచలనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన రాకింగ్ స్టార్ యశ్ (Yash), ఆ తర్వాత చాలాగ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ సినిమాతో వచ్చాడు. నలుగురు హీరోయిన్లు.. లేడీ డైరెక్టర్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అదే అంచనాలతో థియేటర్ కి వెళ్ళిన ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరచడంతో పాటు యశ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. ఈ దెబ్బతో యశ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు అనుకున్నారు. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం యశ్ తన తదుపరి సినిమాను ఒక ప్లాప్ డైరెక్టర్ చేతిలో పెట్టినట్లు తెలుస్తోంది.
ఇటీవలే సర్దార్-2 చిత్రంతో అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద తడబడిన దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తో యశ్ చేతులు కలుపుతున్నట్లు సమాచారం. గ్లామర్, కమర్షియల్ హంగుల కంటే బలమైన కంటెంట్, కొత్త జోనర్‌పై ఈ జోడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గతంలోనే మిత్రన్ యశ్‌కు హాలీవుడ్ రేంజ్‌లో ఒక ఇండియానా జోన్స్ తరహా అడ్వెంచరస్ కథను వినిపించారట. ఆ అడ్వెంచర్ ప్లాట్ యశ్‌కు విపరీతంగా నచ్చినప్పటికీ, కొన్ని కారణాల వల్ల అప్పట్లో అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు అదే కథను మళ్లీ తిరగరాస్తూ, నేటి ట్రెండ్‌కు తగినట్లుగా స్క్రిప్ట్‌కు పదును పెడుతున్నారట. ఇద్దరూ తమ గత సినిమాల రిజల్ట్స్ నుంచి పాఠాలు నేర్చుకుని, ఈసారొక పక్కా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్.
ఈ కాంబినేషన్ కనుక అధికారికంగా అనౌన్స్ అయితే మాత్రం సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరడం ఖాయం. ఒక పక్క భారీ యాక్షన్, మరోపక్క సరికొత్త అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథ యశ్ ఇమేజ్‌ను మళ్లీ పీక్స్‌కి తీసుకెళ్లడం పక్కా అని ఫ్యాన్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈసారి యశ్ కేజీఎఫ్ అంత హిట్ కాకపోయినా.. టాక్సిక్ ని మర్చిపోయే హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.