Mamitha Baiju: విజయ్‌ కూతురు.. సూర్య లవర్

ABN , Publish Date - Jul 27 , 2026 | 04:51 PM

వయస్సు.. ఈమధ్య ఇండస్ట్రీలో తలెత్తుతున్న సమస్య. హీరో- హీరోయిన్ మధ్య వయస్సు తేడా అనేది ఇప్పుడు చాలా ముఖ్యంగా మారింది.

Mamitha Baiju

వయస్సు.. ఈమధ్య ఇండస్ట్రీలో తలెత్తుతున్న సమస్య. హీరో- హీరోయిన్ మధ్య వయస్సు తేడా అనేది ఇప్పుడు చాలా ముఖ్యంగా మారింది. ఒకప్పుడు ఎన్టీఆర్ కి మనవరాలిగా పరిచయమైన శ్రీదేవి.. ఆ తరువాత ఎన్టీఆర్ తోనే రొమాన్స్ చేసింది. అలా ఎంతోమంది హీరోలు తమకన్నా చిన్న వయస్సు హీరోయిన్స్ తో రొమాన్స్ చేశారు. అప్పట్లో ఇదొక పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ, ఇప్పుడు అలా కాదు. 50 ఏళ్ల హీరోతో రొమాన్స్ అంటే మినిమమ్ హీరోయిన్ కి 30 అయినా దాటి ఉండాలి. ఎప్పుడైతే.. 20 దాటిన కుర్ర హీరోయిన్ నటిస్తుంది అని తెలుస్తుందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆ హీరో మీద, హీరోయిన్ మీద ట్రోలింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం మలయాళ బ్యూటీ మమితా బైజు, స్టార్ హీరో సూర్య ఇలాంటి ట్రోలింగ్ నే ఎదుర్కొంటున్నారు.


ప్రేమలు సినిమాతో సౌత్‌లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న మాలీవుడ్ భామ మమితా బైజు కెరీర్ ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మంచి మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోన్న మమితా ప్రస్తుతం విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో సూర్య సరసన నటించింది. ఇదే ఆమె చేసిన పొరపాటు అని పలువురు చెప్పుకొస్తున్నారు. తనకంటే 25 ఏళ్లు పెద్ద అయిన సూర్యతో రొమాన్స్ చేయడం ఏంటి అని విమర్శిస్తున్నారు. ఇటీవలే ఆమె నటించిన జననాయగన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందులో 52 ఏళ్ల దళపతి విజయ్ కుమార్తెగా మమితా కనిపించింది. భగవంత్ కేసరిలో శ్రీలీల అంతా కాకపోయినా అమ్మడు కూడా బానే నటించింది. సూర్య వయస్సు కూడా విజయ్ వయస్సే. ఆయనకు కూతురుగా చేసి.. సూర్యతో రొమాన్స్ ఏంటి.. ? అంటూ ప్రశ్నిస్తున్నారు.


అయితే ఈ చిత్రం ఏజ్ గ్యాప్ ప్రేమకథాంశంతో సాగుతుందని, అందుకే ఈ పాత్రకు ఆమె సరైన ఎంపిక అని చిత్రబృందం ముందే చెప్పుకొచ్చింది. ఇందులో సూర్య ఒక రిచ్ మ్యాన్ లా కనిపిస్తాడు. అతడిని ప్రేమించే అమ్మాయిగా మమితా కనిపిస్తుంది.స్క్రీన్ పై ఈ వయసు వ్యత్యాసాన్ని దర్శకుడు ఎంత కన్విన్సింగ్‌గా చూపిస్తాడనే దానిపైనే మమితా కెరీర్ ఆధారపడి ఉంది. కొంచెం తేడా వచ్చినా సోషల్ మీడియా ట్రోలింగ్, నెగెటివిటీ తప్పవు. అయితే కథపరంగా సూర్య - మమితా పర్ఫెక్ట్ ఛాయిస్ అని, సినిమా చూడకుండా వీరిద్దరి మధ్య రొమాన్స్ అని అనుకోవడం పొరపాటు అని డైరెక్టర్ వెంకీ అట్లూరి చెప్పుకొచ్చాడు. సినిమా చూసి బయటకు వెళ్లేటప్పుడు ఈ ఏజ్ గ్యాప్ తప్పు అనిపించదని ఆయన చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

Updated Date - Jul 27 , 2026 | 05:30 PM