విజయ్ ఆంటోనీ వినూత్న ప్రచారం.. కోవై ఎక్స్‌ప్రెస్‌లో చిత్ర బృందం!

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:57 AM

హీరో విజయ్ ఆంటోనీ నటించిన ‘అప్పాకుట్టి’ సినిమా ప్రమోషన్ కోసం చిత్ర బృందం వినూత్న కార్యక్రమం చేపట్టింది.

vijay antony

‘అప్పాకుట్టి’ చిత్ర బృందం రైలు ప్రయాణం.. ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు వినూత్న ప్రచారం!

సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మరింత ఆదరణ పొందేందుకు చిత్ర బృందాలు వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఇదే కోవలో హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) తన తాజా చిత్రం ‘అప్పాకుట్టి’ (Appakutti) ప్రమోషన్ కోసం సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. చిత్ర ప్రచారంలో భాగంగా హీరో విజయ్ ఆంటోనీ, హీరోయిన్ ప్రీతి అస్రానీ (Preethi Asrani), దర్శకుడు ము.మారన్ (M Maran) తదితరులు రైలు ప్రయాణం చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో సినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో చిత్ర బృందం ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి (Movie Promotions) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం చెన్నై సెంట్రల్ నుంచి కోయంబత్తూరుకు బయలుదేరే కోవై ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించింది.

ఈ రైలు ప్రయాణంలో హీరో విజయ్ ఆంటోనీ, హీరోయిన్ ప్రీతి అస్రానీ, దర్శకుడు ము.మారన్‌తో పాటు పలువురు చిత్ర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్ల కోసం ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి చిత్ర బృందం నేరుగా ప్రయాణికులు, ప్రేక్షకులకు చేరువయ్యేలా రైలు ప్రయాణాన్ని(Train Promotion) ప్రచార వేదికగా మార్చుకుంది. కోయంబత్తూరుకు చేరుకున్న అనంతరం అక్కడి ప్రాంతాల్లోని ‘అప్పాకుట్టి’ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లను చిత్ర బృందం సందర్శించనుంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో నేరుగా మాట్లాడి సినిమా గురించి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. అభిమానులతో ఫొటోలు దిగడం, సినిమా విశేషాలను పంచుకోవడం వంటి కార్యక్రమాలు కూడా ప్రచారంలో భాగంగా ఉండనున్నాయి.

సినిమా విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల మధ్యకు వెళ్లి ప్రచారం నిర్వహించడం చిత్ర బృందం ప్రత్యేక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయ్ ఆంటోనీకి తమిళనాడులో ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకుని కోయంబత్తూరు ప్రాంతంలో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో కొత్త పద్ధతులను అనుసరిస్తున్న చిత్ర బృందం ప్రయత్నం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. థియేటర్లలో ప్రేక్షకులను నేరుగా కలుసుకుంటూ ‘అప్పాకుట్టి’ సినిమాకు మరింత ప్రచారం కల్పించేందుకు హీరో, దర్శకుడు, ఇతర నటీనటులు సిద్ధమయ్యారు. కాగా ఈ సినిమాను తెలుగులో నాన్న కుట్టి (Nanna Kutty)గా విడుద‌ల కావాల్సి ఉండ‌గా ఇక్క‌డ ఎక్కువ‌ చిత్రాల విడుద‌ల ఉండ‌డంతో వ‌చ్చే వారానికి వాయిదా వేశారు. న‌వంబ‌ర్ 27న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల‌లో విడుద‌ల కానుంది.

Updated Date - Nov 22 , 2026 | 12:19 PM