Death Railway: చరిత్రలో దాగిన ఆ భయంకర ఘట్టం.. ఇప్పుడు సినిమాగా!
ABN , Publish Date - Nov 23 , 2026 | 09:11 AM
రెండో ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో ‘డెత్ రైల్వేస్’ తెరకెక్కుతోంది. శశికుమార్, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
రెండో ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో రూపొందిన మాస్ కమర్షియల్ చిత్రం డెత్ రైల్వేస్ (Death Railways). 'యాద్దిసై' ఫేం ధరణి రాజేంద్రన్ (Dharani Rajendran) దర్శకత్వం వహించారు. సీనియర్ నటుడు శశికుమార్ (Sasikumar), సముద్రఖని (Samuthirakani), సేయోన్, భవానీ శ్రీ (Bhavani Sre) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్ర విశేషాలను దర్శకుడు నగరంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
1944లో రెండో ప్రపంచ యుద్ధం (World War 2) ఉదృతంగా సాగుతున్న సమయంలో జపాన్, బర్మా దళాలు భారతదేశంపై దాడికి దూసుకొస్తున్న కాలం నేవథ్యంలో "డెత్ రైల్వేస్' కథ ఉంటుంది. మరుగున పడిన ఈ చారిత్రక ఘట్టం ఆధారంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ చరిత్రను నేరుగా చిత్రీకరించకుండా, కల్పిత కథతో ప్రజలకు చెప్పాలన్నదే నా ముఖ్యోద్దేశం. కథను సిద్ధం చేసుకున్న తర్వాత నటీనటులను ఎంపిక చేసుకున్నాను.
నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు చెందిన ఐఎన్ఏ కమాండర్‌గా శశి కుమార్, సముద్రఖని భారతీయ సైనిక నాయకుడిగా నటించారు. అశోక్ సెల్వన్ (Ashok Selvan) అతిథి పాత్ర పోషించారు. 90 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం. మిగిలిన చిత్రీకరణతో పాటు వీఎఫ్ఎక్స్ తదితర పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులు పూర్తి చేసి వచ్చే యేడాది ఫిబ్రవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. జేకే ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపె జే.కమలకన్నన్ నిర్మించిన ఈ చిత్రానికి సార్ధక్ కళ్యాణ్ సంగీతం అందించారు.