సీన్ తో పోటీ అవసరమా నాన్న కుట్టి
ABN , Publish Date - Oct 10 , 2026 | 09:33 PM
కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ స్టార్ విజయ్ ఆంటోని (Vijay Antony) విజయపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.
కోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ స్టార్ విజయ్ ఆంటోని (Vijay Antony) విజయపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఒక పక్క నిర్మాతగా.. ఇంకోపక్క హీరోగా మారి మంచి విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం అప్పకుట్టి. తెలుగులో నాన్నకుట్టి పేరుతో రిలీజ్ కానుంది. ము మారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్నాడు. బేబీ లితన్య శివబాలన్ ముఖ్య పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తండ్రి-కూతురు సెంటిమెంట్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల విడుదలను వాయిదా వేశారు. ఇక తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీపావళి కానుకగా నవంబర్ 6న థియేటర్లలోకి నాన్న కుట్టి రాబోతుందని మేకర్స్ తెలిపారు. అయితే, అదే రోజు నవంబర్ 6న తమిళ సూపర్‌స్టార్ సూర్య నటిస్తున్న భారీ చిత్రం సీన్ కూడా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
సూర్య, నజ్రియా, నెస్లన్ ప్రధాన పాత్రల్లో జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై అటు తెలుగు.. ఇటు తమిళ్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం సూర్య ఫుల్ ఫార్మ్‌లో ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా సూర్య సినిమా రిలీజ్ రోజునే విజయ్ ఆంటోని తన నాన్నకుట్టి చిత్రాన్ని బరిలోకి దింపుతుండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
సూర్య మార్కెట్, క్రేజ్ ముందు విజయ్ ఆంటోని చిత్రం తట్టుకోగలదా అనే అనుమానాలను వ్యక్తపరుస్తూ సూర్య సీన్ సినిమాతో రావడం అవసరమా నాన్నకుట్టి? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. అయినప్పటికీ, కంటెంట్, తండ్రి-కూతురు ఎమోషన్ వర్కౌట్ అయితే దీపావళి హాలిడే సీజన్‌లో తన మార్క్ హిట్‌ను సాధిస్తామనే ధీమాతో విజయ్ ఆంటోని టీమ్ ఉంది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.