మళ్లీ పెళ్లి చేసుకున్న సూర్య- జ్యోతిక

ABN , Publish Date - Sep 16 , 2026 | 09:48 AM

కోలీవుడ్ హీరో సూర్య - జ్యోతిక దంపతులు ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆకర్షణీయమైన, అడోరబుల్ కపుల్ అన్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

Suriya - Jyothika

కోలీవుడ్ హీరో సూర్య(Suriya) - జ్యోతిక (Jyothika) దంపతులు ఇండియన్ సినీ పరిశ్రమలోనే అత్యంత ఆకర్షణీయమైన, అడోరబుల్ కపుల్ అన్న విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ప్రస్తుతం సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు హీరోగా సూర్య వరుస సినిమాలు చేస్తుంటే, మరొకవైపు నటిగా, నిర్మాగా జ్యోతిక కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా, వారు కూడా ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చేశారు. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పెళ్లయిన 5 ఏళ్లకు, 10 ఏళ్లకు సెలబ్రిటీ జంటలు విడిపోతున్న ఈ రోజుల్లో.. వీరు ఏకంగా 20 ఏళ్ల వివాహ బంధాన్ని పూర్తి చేసుకుని, మరోసారి పెళ్లి చేసుకోని ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.


2006లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట, ఇరువై ఏళ్ల తమ బంధానికి గుర్తుగా ఒక సుందరమైన కోట ఆవరణలో క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. పచ్చని కొండల నడుమ, ప్రకృతి ఒడిలో జరిగిన ఈ వేడుకలో ఇద్దరూ మ్యాచింగ్ వైట్ దుస్తుల్లో ఎంతో ముచ్చటగా కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అంతేకాకుండా సూర్యని కొడుకు దేవ్, తమ్ముడు కార్తీ రెడీ చేసి కూతురు దియా తండ్రిని పెళ్లి కొడుకుగా తీసుకురాగా.. జ్యోతికను పెళ్లి కూతురిగా రెడీ చేసికొడుకు దేవ్ తీసుకురావడం చూడముచ్చటగా కనిపించింది. ఈ వేడుకకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ది సీక్వెల్ అని క్యాప్షన్ ఇచ్చారు.


జీవిత ప్రయాణంలో ఎదురయ్యే లోపాలు, సర్దుబాట్లు, త్యాగాలు, నిస్వార్థమైన ప్రేమను వేడుకగా జరుపుకుంటున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాన్ని, నేర్చుకునే కోణాన్ని, కృతజ్ఞతా భావాన్ని మాత్రమే ఎంచుకుంటానని జ్యోతిక ఈ సందర్భంగా భావోద్వేగపూరితమైన ప్రమాణం చేసింది. కొండల నడుమ జరిగిన ఈ అందమైన వేడుక, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన అరుదైన క్షణాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.


కోలీవుడ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్‌గా పేరుగాంచిన సూర్య- జ్యోతిక పెళ్లి వీడియో చూసి అభిమానులు, సినీ ప్రముఖులు మంత్రముగ్ధులవుతున్నారు. వీరిది నిజమైన, ఆదర్శవంతమైన భాగస్వామ్యానికి నిదర్శనమని కొనియాడుతున్నారు. నిరంతరం ఒకరికొకరు మద్దతుగా నిలిచే సూర్య - జ్యోతికల ఈ మళ్లీ పెళ్లి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, అభిమానులు ఈ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Updated Date - Sep 16 , 2026 | 10:07 AM