Mandaadi Trailer: పందెం అంటే ఎవరు పెద్ద మొనగాడు అని చూపించుకొనే పోటీ కాదు
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:08 PM
కోలీవుడ్ నటుడు సూరి, తెలుగు టాలెంటెడ్ నటుడు సుహాస్, హీరోయిన్ మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం మండాడి.
కోలీవుడ్ నటుడు సూరి (Soori), తెలుగు టాలెంటెడ్ నటుడు సుహాస్ (Suhas), హీరోయిన్ మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం మండాడి (Mandaadi). మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 10 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కాళీ (సూరి).. ఒక మండాడి. అంటే సముద్రంలో జరిగే పడవల పోటీలకు కెప్టెన్. ఎప్పుడు కాళీ టీమ్ నే గెలుస్తూ వస్తుంది. అతను లేకపోవడంతో సాటా పులి (సుహాస్) ఆ మండాడి వర్గాన్ని చేతిలోకి తీసుకుంటాడు. కాళీ వచ్చాక.. అతను కొంతమంది యువకులను టీమ్ గా ఫామ్ చేసి వారికి పడవల పందెం ఎలా గెలవాలో నేర్పిస్తాడు. అలా నేర్చుకున్నవారు సముద్రంలోకి వెళ్ళి ఏమయ్యారు.. ? సాటా పులికి, కాళీకి మధ్య వైరం ఎప్పుడు నుంచి మొదలైంది. చివరకు ఈ పడవ పందెంలో ఎవరు గెలిచారు.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సముద్రం, పడవ పందెలు, మత్స్యకారుల వర్గాల మధ్య జరిగే ఆధిపత్య పోరు నేపథ్యంలో కథ సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఊరి గౌరవం, వ్యాపారం, ఉనికి కోసం జరిగే సముద్ర పోటీల్లో మండాడి వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి మధ్య సాగే తీవ్రమైన వైరం ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నీటిపై సాగే హై-ఆక్టేన్ పడవ పందెం సీన్లు, సూరి, సుహాస్ పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సీట్-ఎడ్జ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.తీరప్రాంత జానపద కథనాలు, సముద్రపు రేసు పోటీలు, కుటుంబ భావోద్వేగాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంతో సూరి, సుహాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.