నటి వడివుక్కరసి కన్నుమూత.. బతికున్నవాళ్లను కూడా చంపేస్తున్నారు కదరా

ABN , Publish Date - Sep 21 , 2026 | 09:00 PM

సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం సీనియర్ నటుల జీవితాలతో చెలగాటమాడటం కొందరికి పరిపాటిగా మారింది. నటీనటులు కొన్నిరోజులు వెండితెరకు లేదా బయటకు కనిపించకపోవడం ఆలస్యం, వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, లేదా చనిపోయారని కథనాలు రాసుకొస్తున్నారు.

Vadivukkarasi

సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం సీనియర్ నటుల జీవితాలతో చెలగాటమాడటం కొందరికి పరిపాటిగా మారింది. నటీనటులు కొన్నిరోజులు వెండితెరకు లేదా బయటకు కనిపించకపోవడం ఆలస్యం, వారు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, లేదా చనిపోయారని కథనాలు రాసుకొస్తున్నారు. గతంలో కమెడియన్ వేణుమాధవ్ వంటి నటులు బతికుండగానే ఇలాంటి దారుణమైన రూమర్లను ఎదుర్కొన్నారు. వారు స్వయంగా కెమెరా ముందుకు వచ్చి 'మేము బతికే ఉన్నాం.. దయచేసి మమ్మల్ని అలా చంపకండి' అని బతిమిలాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు సరిగ్గా అలాంటి వేదననే ఎదుర్కొంటున్నారు దక్షిణ భారత సీనియర్ నటి వడివుక్కరసి.


దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటి వడివుక్కరసి ఇకలేరంటూ, ఆమె తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారంటూ గత కొన్ని రోజులుగా కొన్ని సోషల్ మీడియా వేదికల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు చూసి దక్షిణ భారత సినీ ప్రపంచం, ఆమె అభిమానులు,తోటి నటీనటులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై ఒక ప్రముఖ మీడియా ఛానల్‌తో మాట్లాడుతు ఆమె అసలు నిజమేంటో తెలియజేశారు.


'నేను పూర్తి ఆరోగ్యంతో, చాలా నిక్షేపంగా ఉన్నాను.. నన్ను బతికుండగానే చంపేశారు కదరా. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో ఏమాత్రం నిజం లేదు' అని స్పష్టం చేస్తూ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారు. అలాగే ఈ తప్పుడు వార్తలు చూసి కంగారుపడి, తన యోగక్షేమాలు తెలుసుకోవడానికి ఫోన్లు చేసిన శ్రేయోభిలాషులు, అభిమానులకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏమాత్రం ఆధారాలు లేకుండా సెలబ్రిటీల ప్రాణాలపై ఇలాంటి బాధ్యతారాహిత్యమైన ప్రచారాలు చేయడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


వడివుక్కరసి సినీ ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. నటి కాకముందు ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా తెరకెక్కించిన సిగప్పు రోజాక్కల్ చిత్రం ద్వారా నటనా రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, సుదీర్ఘ సినీ ప్రయాణంలో 350కి పైగా సినిమాలు, 40కి పైగా టీవీ సీరియళ్లలో నటించి మెప్పించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విలన్, అమ్మ, నానమ్మ వంటి ఎన్నో పవర్‌ఫుల్ పాత్రలను పోషించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్, శివాజీ గణేషన్ వంటి దిగ్గజ నటుల చిత్రాలలో ఆమె చేసిన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తే. రీసెంట్‌గా కాన్ సిటీ అనే చిత్రంలో యోగి బాబు తల్లిగా నటించి అలరించిన ఆమె, వయసు పైబడినప్పటికీ మంచి పాత్రలు వస్తే నటించడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Updated Date - Sep 21 , 2026 | 09:02 PM