విజయ్ - త్రిష రిలేషన్.. సంగీత ఒప్పుకుందా

ABN , Publish Date - Aug 08 , 2026 | 09:09 PM

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం అటు తమిళ్ ఇండస్ట్రీలో .. ఇటు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.

Vijay - Trisha

తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం అటు తమిళ్ ఇండస్ట్రీలో .. ఇటు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరైన సంగీత.. ఈ కేసును ఇకపై కోర్టులో కొనసాగించబోనని వెల్లడించింది. దీంతో విజయ్ అభిమానుల్లో మరోసారి కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. విజయ్ రాజకీయ ప్రచారం తలమునకలు అయ్యి ఉన్నప్పుడు సంగీత ఆయనపై సంచలన ఆరోపణలు చేసింది. విజయ్ తో విడాకులు కావాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా విజయ్.. త్రిషతో రిలేషన్ లో ఉన్నాడని, అతనితో ఇక కలిసి ఉండడం తనవలన కాదని తేల్చి చెప్పింది. దీంతో పాటు భారీ సంఖ్యలో భరణం కూడా కావాలని కోరింది.


ఇక సడెన్ గా ఇప్పుడు ఆమె ప్లేట్ తిప్పేసింది. విడాకుల కేసును వెనక్కి తీసుకుంది. అంటే అప్పుడు సంగీత చేసిన ఆరోపణలన్నీ అబద్ధమా.. ? లేక వారిద్దరి రిలేషన్ ని ఆమె ఒప్పుకుందా.. ? అనే అనుమానాలు ఇండస్ట్రీలో తలెత్తుతున్నాయి. భర్త వేరొక నటితో సంబంధం పెట్టుకొని, ఇద్దరూ కలిసి అన్నీ ఫంక్షన్స్ కి వెళ్తూ.. ఆయన సక్సెస్ కి ఆమె కారణం అని ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా కూడా సంగీత ఇవన్నీ తట్టుకొని విజయ్ తో ఉంటుందా.. ? అంతటి తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత మళ్లీ పాత బంధాన్ని కొనసాగించడానికి ఆమె ఒప్పుకుందా.. ? కుటుంబ పెద్దలు వారిద్దరినీ కూర్చోబెట్టి ఏవిధంగా సంగీతని ఒప్పించారు.. ? ఇలా అనేక ప్రశ్నలు అభిమానుల మనస్సులో మెదులుతున్నాయి.


అయితే.. అందరూ అనుకున్నట్లు సంగీత.. విజయ్ తో కలిసి ఉండడానికి కేసు వాపస్ తీసుకోలేదని సమాచారం. విజయ్-సంగీత మళ్లీ కలిసిపోతున్నారా అంటే లేదన్న మాట వినిపిస్తుంది. మరి అలాంటప్పుడు కేసు వాపస్ ఎందుకు తీసుకుంది. అసలు కేసు వాపస్ తీసుకోవడం వెనుక ఉన్న అసలు నిజం ఏంటి.. ? అంటే కేవలం విజయ్ గౌరవం కోసం మాత్రమే సంగీత విడాకుల అంశాన్ని లీగల్ గా చేయకుండా ఆపిందని అంటున్నారు. విజయ్ సీఎం అయ్యాక కుటుంబ పెద్దలు సంగీతతో మాట్లాడిన విషయం కూడా ఇదే అని టాక్.


కేవలం మీడియా ప్రచారానికి దూరంగా ఈ వివాదాన్ని ముగించాలని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్ గౌరవానికి భంగం వాటిల్లకుండా చూడాలని చెప్పడంతో సంగీత కన్వీన్స్ అయ్యి కేసు వెనక్కి తీసుకున్నదట. లీగల్ గా కాకుండా ఇంట్లోనే వీరు ఆ సమస్యని పరిష్కరించుకోబోతున్నారట. విడాకుల కేసు బయటకు రాగానే విజయ్.. తన సమస్యని తానే పరిష్కరించుకుంటాను అని చెప్పడం వెనుక అర్ధం కూడా ఇదేనని కొందరు చెప్పుకొస్తున్నారు. కుటుంబ సమస్యని ప్రజల సమస్యగా మారకుండా ఇంటిగుట్టు బయటకు పొక్కకుండా చేయడానికి విజయ్ వేసిన ప్లాన్ ఇదేనని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Aug 08 , 2026 | 09:11 PM