ఆపరేషన్ ఓం.. నిత్యారెడ్డిని ఈ రేంజ్ లో ఊహించలేదే
ABN , Publish Date - Oct 26 , 2026 | 09:10 PM
స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్' (OM). ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోన్నారు.
స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఓం – చాప్టర్ 1: ఉధిరం – ది బ్లడ్ వుడ్' (OM). ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తోన్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి, సాయిపల్లవి(Sai Pallavi), శ్రీలీల, నసీరుద్దీన్ షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి హీరోయిన్ సాయిపల్లవి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియో విడుదలైంది.
ఈ సినిమాలో మొట్ట మొదటిసారి సాయిపల్లవి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించింది. నిత్యారెడ్డి అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె నటన సినిమాకే హైలెట్ కానుందని ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. నిత్యారెడ్డి తెలివితేటలు, నిజాయతీ, అనుభవం ఉన్న యువ పోలీస్ ఆఫీసర్. తండ్రి కూడా పోలీస్ ఆఫీసర్ కావడంతో.. ఆమెకు డిపార్ట్మెంట్ లో గౌరవం ఉంటుంది. గతంలో సీబీఐ, ఇంటర్‌పోల్‌లో పనిచేసిన ఆమె.. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఆపరేషన్ ఓం ని స్టార్ట్ చేస్తుంది. మరి ఆ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా.. ? నిత్యారెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుందా..? ఈ మధ్యలో ఆమె ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలో సాయిపల్లవి పవర్ఫుల్, ఇంటెన్స్ లుక్‌లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు ఇలాంటి క్యారెక్టర్ లో సాయిపల్లవిని ఎవరూ ఊహించలేదు. అధికారాన్ని ప్రతిబింబించే బాడీ లాంగ్వేజ్, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పాటు నిత్యారెడ్డి పాత్రలోని విభిన్న కోణాలను ఎంతో అద్భుతంగా చూపించారు. సహజమైన నటన, హావభావాలతో ప్రేక్షకులను మెప్పించే సాయిపల్లవి.. నిత్యా రెడ్డి పాత్ర కోసం ఆమె చేసిన అద్భుతమైన మేకోవర్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది. భారీ తారాగణం, పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ వీడియోలతో ఓం పై మేకర్స్ ఆసక్తిని పెంచేస్తున్నారు. దీంతో ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా యాక్షన్ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. ఓం నవంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.