ఏమయ్యా లోకేష్.. ఆ బెంజ్ ని కొంచెం పట్టించుకోవయ్యా

ABN , Publish Date - Aug 26 , 2026 | 07:56 PM

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమధ్య డిసి సినిమాతో హీరోగా మారి .. మంచి విజయాన్ని అందుకున్నాడు.

Nivin Pauly

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమధ్య డిసి సినిమాతో హీరోగా మారి .. మంచి విజయాన్ని అందుకున్నాడు. హీరోగా హిట్ అందుకోవడంతో లోకేష్.. తన సినిమాలను పట్టించుకోవడం మానేశాడా అంటే నిజమే అని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో బెంజ్ సినిమాను ప్రకటించి రెండేళ్ళు అవుతుంది. రాఘవా లారెన్స్ హీరోగా మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తోండగా లోకేష్ కనకరాజ్ స్క్రిప్ట్ అందించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, నివిన్ గ్లిమ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ అప్డేట్స్ తప్ప ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒక్క అప్డేట్ లేదు.


బెంజ్ ఒప్పుకున్నాక నివిన్ రెండు సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కోసం ఆయన గడ్డం పెంచాడు. ఇప్పటికీ రెండేళ్ళు అవుతున్నా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. వేరే సినిమాల కోసం గడ్డం తీయాలంటే.. బెంజ్ షూటింగ్ కి ఇబ్బంది కలుగుతుందేమో అని నివిన్ గడ్డం తీయకుండా ఉంటున్నాడట. దీనివలన తాను ఎంతో ఇబ్బందికి గురవుతున్నట్లు నివిన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. వివాదాలకు దూరంగా ఉంటూ, అత్యంత సింపుల్‌గా ఉండే ఈ హీరో తాజాగా తాను ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందికర పరిస్థితి గురించి హుందాగా మాట్లాడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.


'ఈ సినిమాలో నా పాత్ర కోసం ప్రత్యేకంగా గడ్డం పెంచాను. షూటింగ్ ఆలస్యం కావడంతో ఆ గడ్డాన్ని అలాగే ఉంచాల్సి వచ్చింది. దీనివల్ల నేను నటించిన ఇతర మలయాళ చిత్రాల్లోనూ ఇదే లుక్‌తో కనిపించాల్సి వచ్చింది. బెంజ్ నా భాగం షూటింగ్ ప్రారంభం కాకముందే నా రెండు మలయాళ సినిమాలు థియేటర్లలోకి వచ్చేశాయి. నాకు ఇంకా ఒక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈలోపే బెంజ్ టీమ్ ఈ ప్రాజెక్ట్‌పై ఒక స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాను' అని విజ్ఞప్తి చేశాడు. గతంలో సర్వం మాయ, ఇటీవలే బెత్లెహాం కుడుంబ యూనిట్ చిత్రాలతో వరుస విజయాలను అందుకుని మంచి ఫామ్‌లో ఉన్న నివిన్ పౌలీ, ఎంతో వినమ్రంగా తన సమస్యను వివరించడం ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనమని సినీ వర్గాలు కొనియాడుతున్నాయి. ఈ విషయం తెలియడంతో నెటిజన్స్.. లోకేష్ పై ఫైర్ అవుతున్నారు. ఏమయ్యా లోకేష్.. ఆ బెంజ్ సంగతి చూడవయ్యా.. కనీసం నివిన్ పార్ట్ వరకు అయినా పూర్తిచేయొచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి నివిన్ మనవిని లోకేష్ వింటాడా.. లేదా చూడాలి.

Updated Date - Aug 26 , 2026 | 07:56 PM