తెలుగులో లోకేష్ సినిమా పరిస్థితి ఏంటి..

ABN , Publish Date - Aug 06 , 2026 | 09:55 PM

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా పరిచయమవుతూ అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా DC (దేవదాస్ & చంద్ర)

Lokesh Kanagaraj

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కథానాయకుడిగా పరిచయమవుతూ అరుణ్ మత్తేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా DC (దేవదాస్ & చంద్ర). వామికా గబ్బి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, ఇటీవల విడుదలైన విజువల్స్, ట్రైలర్ సినిమాపై కోలీవుడ్‌లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే, ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రం, తెలుగు మార్కెట్‌లో ప్రమోషన్ల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందనే అభిప్రాయాలు సినీ వర్గాల నుంచి వ్యక్తం అవుతున్నాయి.


మరోవైపు, ఇదే రోజున థియేటర్లలోకి వస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మార్క్ హారర్ కామెడీ కొరియన్ కనకరాజు ప్రమోషన్లతో హోరెత్తించింది. దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, యూనిక్ కాన్సెప్ట్ వీడియోలతో ఆడియన్స్‌లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడమే కాకుండా, ప్రీమియర్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ టీమ్ చేసిన సరికొత్త ప్రమోషన్లు, తమన్ సంగీతం సినిమాకు గట్టి పునాదిగా మారాయి.


ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కొరియన్ కనకరాజు పోటీని తట్టుకుని DC నిలబడటం పెద్ద సవాలుగా మారింది. లోకేష్ కనగరాజ్‌కు తెలుగులో డైరెక్టర్‌గా విపరీతమైన క్రేజ్ ఉన్నప్పటికీ, నటుడిగా ఆయనను చూడటానికి తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆసక్తి చూపిస్తారనేది సస్పెన్స్‌గా మారింది. సన్‌పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాకి కనీసం డబ్బింగ్ ప్రమోషనల్ ఈవెంట్స్ గానీ, తెలుగు హీరోల సపోర్ట్ గానీ లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.


ఈ నేపథ్యంలో రేపు థియేటర్లలోకి వస్తున్న DC సినిమాకు కేవలం లోకేష్ కనగరాజ్ ఇమేజ్, పాజిటివ్ మౌత్ టాక్ మాత్రమే దిక్కవుతాయి. ఒకవేళ అరుణ్ మత్తేశ్వరన్ మార్క్ రఫ్ యాక్షన్ తో పాటు సినిమా కంటెంట్ కనెక్ట్ అయితేనే కొరియన్ కనకరాజు దాటిని తట్టుకుని తెలుగు బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. రేపటి మొదటి షో తోనే ఈ తమిళ దర్శకుడి హీరో అవతారానికి తెలుగు ప్రేక్షకులు ఏ రేంజ్ మార్కులు వేస్తారో తేలిపోనుంది.

Updated Date - Aug 06 , 2026 | 09:59 PM