Keerthy Suresh: ఎవరో అన్న మాటలకు వివరణ ఇచ్చి వారిని సరిదిద్దే రకం కాదు
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:40 PM
నటి కీర్తిసురేశ్ తన సినిమాల ఎంపికలో ఎప్పుడూ ఒకే మూసలో ఉండటానికి ఇష్టపడరు. కొత్తదనం ఉన్న కథల వైపు ఆమె అడుగులు వేస్తుంటారు. ‘మహానటి’ తర్వాత తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది
నటి కీర్తిసురేశ్ తన సినిమాల ఎంపికలో ఎప్పుడూ ఒకే మూసలో ఉండటానికి ఇష్టపడరు. కొత్తదనం ఉన్న కథల వైపు ఆమె అడుగులు వేస్తుంటారు. ‘మహానటి’ తర్వాత తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది ‘డోరతి’. అలాగే, ఇటీవలే విడుదలై అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతోంది ‘అక్క’ వెబ్‌సిరీస్. తనపై వచ్చే ట్రోలింగ్, ప్రయాణాల్లో ఎదురైన చేదు అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు.
‘నిజానికి ‘బేబీ జాన్’ సినిమా కంటే ముందే నేను సైన్ చేసిన ప్రాజెక్ట్ ‘అక్క’. ఇదే నా తొలి హిందీ ప్రాజెక్ట్‌గా రావాల్సింది. ఒక వెబ్‌సిరీస్ ఫార్మాట్లో నేను ఇంతకుముందు ఎప్పుడూ పనిచేయలేదు. పైగా ఈ కథ విన్నప్పుడే నాకు చాలా బలంగా అనిపించింది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో వైఆర్ఎఫ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సిరీస్ అక్టోబర్ 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. 1980ల నాటి నేపథ్యంలో మహిళల ఆధిపత్యం ఉండే పెర్నూరు అనే ఊహాత్మక రాజ్యం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో నేను పోషించిన ’భవానీ‘ పాత్రకు, రాధికా ఆప్టే పోషించిన ‘రుద్ర’ పాత్రకు మధ్య సాగే ఆధిపత్య పోరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ప్రయోగాలు ఇష్టం
ప్రేక్షకుల అభిరుచులు మారుతున్న కొద్దీ నా సినిమాల ఎంపిక మారుతుందా? అంటే కచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే, కొన్ని సినిమాలు కేవలం నా ఆత్మసంతృప్తి కోసం చేస్తాను. గత రెండు మూడేళ్లుగా కొన్ని కామెడీ సినిమాలు చేశాను. ఆ జోనర్ నాకు చాలా ఇష్టం. ’అక్క‘ లాంటి ఒక తీవ్రమైన, బరువైన పాత్ర చేసిన వెంటనే, ఒక కామెడీ సినిమా చేశాను. అది ఆ బరువైన ఎనర్జీని తగ్గించి, నన్ను నేను రిఫ్రెష్ చేసుకోవడానికి, తిరిగి నా సహజ సిద్ధమైన స్థితికి రావడానికి ఎంతో ఉపయోగపడింది. నటిగా నన్ను నేను ఒకే చట్రంలో బంధించుకోవాలని అనుకోవడం లేదు. అన్ని రకాల పాత్రలు చేస్తూ, కొత్త ప్రయోగాల ద్వారా నన్ను నేను ఒక నటిగా ఆవిష్కరించుకోవడమే నాకిష్టం. రిస్క్ తీసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం..
విమానంలో చేదు అనుభవం
ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త వ్యక్తులను కలవడం, సామాన్యులతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. మన పని వాతావరణం దాటి బయటి ప్రపంచంలోని మనుషులను కలిసే అవకాశం అక్కడే దొరుకుతుంది. కొందరు అభిమానులు ఎంతో మర్యాదగా ఉంటారు. కానీ, కొందరి ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇటీవల నేను, నా భర్త మిలాన్ నుంచి ఇండియాకు విమానంలో తిరిగి వస్తున్నాం. నేను ఒకవైపు, నా భర్త మరోవైపు కూర్చున్నాం. అప్పుడు బాగా మద్యం తాగి ఉన్న ఒక వ్యక్తి సెల్ఫీ కావాలని పట్టుబట్టాడు. నేను సున్నితంగా తిరస్కరించినా మీదికి రావడంతో నా భర్త కల్పించుకోవాల్సి వచ్చింది. చివరకు ఫ్లైట్ సిబ్బంది వచ్చి ఆ పరిస్థితిని చక్కదిద్దారు. ప్రేక్షకుల వల్లే మేము ఈ స్థాయిలో ఉన్నాము కాబట్టి వారితో కలవడం మా బాధ్యత, కానీ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలు బాధిస్తాయి.
‘డోరతి’ పాత్ర ప్రత్యేకం
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో, గునీత్ మోంగా నిర్మాణంలో వచ్చిన ‘డోరతి’ నా కెరీర్లో ‘మహానటి’ తర్వాత అంతటి ప్రత్యేకమైన చిత్రం. 1990ల నాటి తమిళనాడు గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చిన్ననాటి స్నేహితులైన కార్తీ, సుబ్బుల జీవితాల్లోకి ప్రేమగా, ఆప్యాయతగా ఉండే డోరతి అనే మహిళ వస్తుంది. ఆమెకు జరిగిన ఒక విషాదం వారి జీవితాలను ఎలా మార్చిందనేదే ఈ సినిమా. తమిళ ప్రధాన స్రవంతి సినిమాలో ‘ఎల్జీబీటీక్యూ’ అంశాలపై ఇంత బలంగా చర్చ జరగడం ఇదే మొదటిసారి. ఈ సినిమా క్లైమాక్స్‌పై నా స్నేహితుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరికి సినిమా నచ్చి క్లైమాక్స్ నచ్చలేదు, మరికొందరికి సినిమా మొత్తం విపరీతంగా నచ్చింది. ఏదైతేనేం, ఈ సినిమా సమాజంలో ఒక ఆరోగ్యకరమైన చర్చకు దారితీసింది. మేము కోరుకున్నది కూడా అదే.
కథలో నా పాత్రే ఆత్మ!
‘డోరతి’ సినిమా ఒప్పుకున్నప్పుడు ఇండస్ట్రీలో చాలామంది ‘ఇది కేవలం ఆరేడు రోజుల షూటింగ్ మాత్రమే కదా, ఇందులో నువ్వు చేసేదేముంది?’ అని అడిగారు. కానీ, నాకు పాత్ర నిడివి కంటే ఆ కథలో నా పాత్రకు ఉన్న ప్రాముఖ్యత ముఖ్యం. సినిమా చూసిన వారికి అందులో నా పాత్రే ఆత్మ అని అర్థమవుతుంది. ఇందులో నటించిన సనంత్, రిషికాంత్లను షూటింగ్‌కు ముందు నేను ఎప్పుడూ కలవలేదు. సనంత్ను అంతకుముందు తెరపై మాత్రమే చూశాను. కానీ సెట్లో వారితో కలిసి నటిస్తుంటే ఎన్నో ఏళ్ల పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఒక మంచి కథ, బలమైన పాత్రలు ఇచ్చే మ్యాజిక్ అదే.
ట్రాన్స్జెండర్ల ఆత్మీయ పిలుపు
ఈ సినిమా విడుదలయ్యే ముందు ఇది కేవలం విమర్శకుల ప్రశంసలకు మాత్రమే పరిమితమవుతుందని, బాక్సాఫీస్ వద్ద ఆడదని కొందరు అన్నారు. కానీ, థియేటర్లలో విజయవంతంగా ఆడి ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లోనూ మంచి ఆదరణ పొందుతోంది. సినిమా సక్సెస్ మీట్‌కు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు వచ్చి మాట్లాడారు. వారంతా నన్ను ఎంతో ఆప్యాయంగా తమిళంలో ‘అన్ని’ (వదినా) అని ఆత్మీయంగా పిలిచారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి దోహదపడే ఇలాంటి కథలో భాగమైనందుకు, ప్రేక్షకుల నుంచి ఇంతటి ఆదరణ పొందినందుకు ఒక నటిగా అంతకంటే గొప్ప సంతృప్తి ఇంకేముంటుంది?
‘మహానటి’ సినిమాకు ముందు నాపై చాలా విమర్శలు వచ్చేవి. నన్ను రకరకాల మాటలు అనేవారు. కానీ, నేను ఎప్పుడూ ట్రోల్స్‌కు స్పందించలేదు. సోషల్ మీడియాలో కూర్చుని ఎవరో అన్న మాటలకు వివరణ ఇచ్చుకునే, వారిని సరిదిద్దే రకంకాదు నేను. కొందరికి నేను నచ్చవచ్చు, ఇంకొందరికి నచ్చకపోవచ్చు. అది వ్యక్తిని బట్టి మారుతుంది. దాన్ని నేను అస్సలు పట్టించుకోను. నా మీద నాకు నమ్మకం ఉంచుకుని, నా పనిని నిజాయితీగా చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలిసిన ఏకైక సూత్రం.
ALSO READ:
Sreeleela: త్వరలోనే.. చాలా గుడ్ న్యూస్‌లు చెబుతా
అప్పుడు.. 'రంగస్థలంలో గోదావరి యాస, 'పుష్ప' చిత్తూరు మాండలికం ఇప్పుడు 'భోగి కి తెలంగాణ యాస