అయ్యో.. కార్తీకి ఈలాంటి పరిస్థితి వచ్చిందేంటి

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:00 PM

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తమిళ నటుడు కార్తీ, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత సంక్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంటున్నాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

దక్షిణాది చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తమిళ నటుడు కార్తీ (Karthi), ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత సంక్లిష్టమైన కాలాన్ని ఎదుర్కొంటున్నాడు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. తెలుగులో సూర్య కన్నా కార్తీకే గుర్తింపు ఎక్కువ. ఒకప్పుడు ప్రయోగాత్మక చిత్రాలతోనూ, మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్లతోనూ తెలుగు, తమిళ బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన కార్తీ.. ఇటీవలి కాలంలో వరుస ప్లాపుల వల్ల కాస్త మందగించిందనేది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. థియేట్రికల్ రన్ ముగియకముందే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోకి సినిమాలు రావడం ఇప్పుడు ఆయన మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని చెప్పొచ్చు.


కార్తీ చివరగా హిట్ కొట్టిన చిత్రం సత్యం సుందరం. ఆ తరువాత కార్తీ నుంచి వచ్చిన కంగువ, వా వాతియార్, సర్దార్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా మరీ దారుణంగా విడుదలైన 21 రోజుల వ్యవధిలోనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పోటీగా బరిలోకి దిగిన ఇతర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద శతకోటి వసూళ్లతో దూసుకుపోతున్న సమయంలో, ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ఇంత త్వరగా డిజిటల్ బాట పట్టడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అంతకుముందు వచ్చిన వా వాతియార్ కూడా రెండు వారాలకే ఓటీటీకి వచ్చింది. దీంతో కార్తీ రేంజు పడిపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇలా అయితే కార్తీ కెరీర్ కష్టమని చెప్పుకొస్తున్నారు. అయ్యో.. కార్తీకి ఎలాంటి పరిస్థితి వచ్చిందేంటి.. కార్తీ రూటు మార్చాల్సిందే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


మరోవైపు ఆయన భవిష్యత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా స్పష్టత కొరవడుతోంది. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖైదీ 2 విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రాధాన్యతలు మారడం, ఇతర భారీ స్టార్ ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉండటంతో ఈ సీక్వెల్ తక్షణమే పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. అలాగే ప్రకటించిన ఇతర చిత్రాలు కూడా నిర్మాణ జాప్యం వల్ల ఆలస్యమవుతుండటం కార్తీ రేంజ్‌ను, థియేట్రికల్ హోల్డ్‌ను దెబ్బతీస్తోంది. సినిమా కోసం ఎంత శ్రమించినా, కంటెంట్ ఆడియన్స్‌ను మెప్పించలేకపోతే థియేటర్ వర్సెస్ ఓటీటీ విండో తగ్గిపోవడం ఖాయమనేది ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. అయితే, కథల ఎంపికలో సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ, తన సోదరుడు సూర్య తరహాలోనే ఒక బలమైన కంబ్యాక్ హిట్ ఇవ్వడం కార్తీకి పెద్ద కష్టమేమీ కాదు. తనదైన సాలిడ్ స్క్రిప్ట్‌తో ఆయన మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకుంటాడా.. లేదా.. అనేది చూడాలి.

Updated Date - Sep 30 , 2026 | 04:00 PM