Kannan Ravi: ఏ ఒక్కరికైనా రూ.లక్షకు బినామీగా ఉన్నట్టు నిరూపించినా.. కోటి రూపాయలు ఇస్తా
ABN , Publish Date - Nov 08 , 2026 | 07:40 AM
డీఎంకే మాజీ మంత్రి దురైమురుగన్తో సంబంధాలు, కుమారుడి వివాహ ఖర్చులపై వచ్చిన విమర్శలకు నిర్మాత కన్నన్ రవి ఘాటుగా స్పందించారు.
డీఎంకే (DMK) మాజీ మంత్రి దురైమురుగన్ (Duraimurugan) కు మాత్రమే కాదు దేశంలో ఏ ఒక్క రాజకీయ నేతకు కేవలం లక్ష రూపాయలకు బినామీగా (Benami Allegations) ఉన్నట్టు నిరూపిస్తే రూ.కోటి బహుమానంగా ఇస్తానని ప్రముఖ నిర్మాత కన్నన్ రవి (Kannan Ravi) ప్రకటించారు. అలాగే, 20-25 ఏళ్లుగా తన ఊరి ప్రజలకు చీరలు, పంచెలు, మిఠాయిలు పంచుతూ. వారితో కలిసి దీపావళి పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుదేవా (Prabhudeva) , వడివేలు (Vadivelu) ప్రధాన పాత్రలను పోషించిన బ్యాంగ్ బ్యాంగ్ (Bang Bang Movie) చిత్రం త్వరలోనే విడుదల కానుంది. శామ్డ్రిగ్స్ దర్శకుడు. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకలో నిర్మాత కన్నన్ రవి పాల్గొని ఇటీవల తనపై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
తాజాగా జరిగిన తన కుమారుడి వివాహం నుంచి గతంలో తనపై వచ్చిన చెక్ బౌన్స్ వ్యవహారం వరకు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మాజీ మంత్రి, డీఎంకే నేత దురైమురుగన్కే కాదు ఏ ఒక్క రాజకీయ నేతకు లక్ష రూపాయిలకు బినామీగా ఉన్నట్టు నిరూపిస్తే కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాను. నేను ఖర్చు చేసే ప్రతి రూపాయి పూర్తిగా వైట్ మనీ. విదేశాల్లో నేను సంపాదించే ప్రతి రూపాయికి, ఖర్చు చేసే ప్రతి పైసాకు పన్ను చెల్లిస్తున్నా. వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికీ రెండు పార్శాలు ఉంటాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. వ్యాపారం చేసే ఏ ఒక్కరూ ఉత్తమడు కాదు.
ప్రధాని మోదీ నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు నా కుమారుడు వివాహాన్ని ఇక్కడే నిర్వహించా. పెట్టుబడులు రావాలి. పెట్టుబడిదారులు రావాలని కోరుకుంటారు. కానీ, పెట్టుబడిదారులు వస్తే వారిని ఎందుకు హేళన చేస్తారు. అలాంటి వారిని సాదరంగా స్వాగతించండి. మాజీ మంత్రి దురైమురుగన్ ఇంటి ఆడబిడ్డను కోడలిగా చేసుకున్నంత మాత్రాన ఒకరు అవినీతిపరుడు కాదు. నా కుమారుడి పెళ్లికి ఖర్చు చేసిన నగదు ఇసుక దోపిడీలో (Sand Mining Allegations) సంపాదించిందంటూ ప్రచారం చేస్తున్నారు. ఆది తప్పు దుబాయ్ ఎడారి ఇసుక తిన్నెల్లో శ్రమించి సంపాదించిన సొమ్ము, ఖర్చు చేసిన ప్రతి పైసా నా కష్టార్జితం. ప్రజలు పన్ను రూపంలో చెల్లించే సొమ్మును రాజకీయ నేతలు స్వలాభాల కోసం ఖర్చు చేయకుండా మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలి' అని పిలుపునిచ్చారు.