సిగ్మా.. తల్లి వచ్చింది.. తండ్రి ఎక్కడ
ABN , Publish Date - Oct 02 , 2026 | 09:44 PM
కోలీవుడ్ దళపతి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమయిన మొదటి చిత్రం 'సిగ్మా' (Sigma).
కోలీవుడ్ దళపతి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తనయుడు జేసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా పరిచయమయిన మొదటి చిత్రం 'సిగ్మా' (Sigma). ఈ శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రిలీజ్ అయ్యింది. ఇక ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కోసం జేసన్ తల్లి, విజయ్ భార్య సంగీత తమ పిల్లలతో కలిసి థియేటర్‌కు వచ్చి సపోర్ట్ అందించారు. అయితే, కొడుకు మొదటి సినిమాకి తండ్రిగా పూర్తి అండగా నిలవాల్సిన విజయ్ మాత్రం ఈ షోకి రాకపోవడం, అసలు ఎలాంటి ప్రచారం చేయకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన మొదటి సినిమా కావడంతో తండ్రిగా విజయ్ గ్రాండ్‌గా సపోర్ట్ చేస్తారని అందరూ భావించారు. కానీ విజయ్ ఈ వైపు చూడకపోవడంతో కొడుకు కెరీర్‌పై విజయ్‌కి శ్రద్ధ లేదా? లేక రాజకీయాల్లో బిజీగా ఉండి దూరంగా ఉంటున్నారా?అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే జేసన్ మాత్రం.. తను డైరెక్టర్ అవ్వడానికి తన తండ్రి ఎంతో మోటివేషన్ ఇచ్చాడని, సందీప్ తో మొదట మాట్లాడింది విజయేనని చెప్పుకొచ్చాడు. విజయ్ సీఎం అయ్యాక .. కొడుకు సినిమా గురించి ఒక్క మాట మాట్లాడింది లేదు. దీంతో ఎంత బిజీగా ఉన్నా, సొంత కొడుకు డెబ్యూ డైరెక్టోరియల్ మూవీకి ఒక తండ్రిగా కనీస ప్రచారం కల్పించాల్సిన బాధ్యత విజయ్‌పై ఉందంటూ నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా పెట్టలేదని చెప్పుకొస్తున్నారు.
మరోవైపు, భారీ అంచనాల మధ్య విడుదలైన సిగ్మా చిత్రం తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. టాక్ పరంగా, బాక్సాఫీస్ వసూళ్ల పరంగా తెలుగు వెర్షన్ మిశ్రమ ఫలితాన్ని మాత్రమే అందించింది. తొలి సినిమాతోనే పర్వాలేదనిపించినా, సరైన ప్రమోషన్లు, స్టార్ పవర్ సపోర్ట్ లేకపోవడమే ఈ నిరాశాజనక ఫలితానికి కారణమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జేసన్ సంజయ్ డెబ్యూ చిత్రానికి విజయ్ ఏమైనా హెల్ప్ చేస్తాడా అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో విజయ్ ఏమైనా ఈ సినిమా గురించి అధికారికంగా మాట్లాడి, తన మాటలతో సిగ్మాకి బూస్ట్ ఇస్తారేమో వేచి చూడాలి. ఒకవేళ విజయ్ రెస్పాండ్ అయితే మాత్రం ఈ సినిమాకు క్రేజ్ పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.