Dhruva Natchathiram: 'ధ్రువనక్షత్రం' భవితవ్యం తేలేది నేడే!
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:45 AM
చియాన్ విక్రమ్ 'ధ్రువనక్షత్రం' సినిమా విడుదలకు మార్గం సుగమం కాలేదు. కోర్టుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినా గౌతమ్ మీనన్ మరో నెల రోజులు గడువు పొడిగించమని కోరారు.
చియాన్ విక్రమ్ (Vikram) హీరోగా, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ (Goutham Vasudeva Menon) తెరకెక్కించిన 'ధ్రువ నక్షత్రం' (Dhruva Natchathiram) చిత్రానికి కష్టాలు ఇంకా తీరలేదు. ఆ సినిమా నిర్మాతలకు, పెట్టుబడిదారులకు మధ్య నెలకొన్న వివాదం కోర్టులో ఉంది. వరుస వాయిదాలు, ప్రతిపాదనల అనంతరం జూన్ 15 లోపు తాను ఈ సినిమాను విడుదల చేస్తానని, అప్పటి వరకూ సమయం ఇవ్వమని గతంలో కోర్టును గౌతమ్ వాసుదేవమీనన్ కోరారు. అందుకు మద్రాస్ హైకోర్టు అంగీకరించింది. అయితే... గౌతమ్ మీనన్ కోర్టుకు హామీ ఇచ్చినట్టుగా ఈ సినిమాను గడువులోగా విడుదల చేయడంలో విఫలమయ్యారు. దాంతో జూలై 15 వరకూ గడువు పొడిగించమంటూ తాజాగా గౌతమ్ మీనన్ కోర్టుకు విన్నవించు కున్నారు. దీనిపై కోర్టు సోమవారం తీర్పు ఇవ్వాల్సి ఉంది.
ఇదిలా ఉంటే... ఇప్పటికే ఈ సినిమా ఇన్వెస్టర్స్ గౌతమ్ వాసుదేవ మీనన్ మీద ఓ కేసు వేశారు. జూన్ 15లోగా ఈ సినిమాను గౌతమ్ మీనన్ పాత బాకీలు సెటిల్ చేసి విడుదల చేసుకోమని ఇచ్చిన తీర్పునూ వారు సవాల్ చేశారు. గౌతమ్ వాసుదేవమీనన్ మీద ఈ సినిమా ఫైనాన్షియర్స్ అయిన కె. ప్రేమ్ కుమార్, కె. పుణ్యమూర్తి చేసి కేసు కూడా సోమవారమే హియరింగ్‌కు వస్తోంది. సినిమా విడుదలలో ఊహించని విధంగా జాప్యం జరగడంతో పాటు... తమ వాటాల పంపకంలో ఏర్పడిన అనిశ్చిత స్థితిపై న్యాయం కోరుతూ వీరు కోర్టును ఆశ్రయించారు. మరి ఇవాళ్టి తీర్పు వీరికి అనుకూలంగా వస్తుందా? లేకపోతే గౌతమ్ వాసుదేవ మీనన్ కోరినట్టు మరో నెల రోజుల గడువు లభిస్తుందా? అనేది వేచి చూడాలి.
ఏదేమైనా నటుడిగా చక్కని ప్రతిభ కనబరుస్తున్న గౌతమ్ మీనన్ దర్శకుడిగా మాత్రం కొంతకాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఆయనతో సినిమాలు నిర్మించిన నిర్మాతల నుంచి, ఫైనాన్షియర్స్ నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొంతకాలంగా 'ధ్రువనక్షత్రం' చిత్రం ఇప్పుడు విడుదల అవుతుంది... అప్పుడు విడుదల అవుతుంది అంటూ కాలయాపన చేసిన మేకర్స్... ఇప్పుడు ఏం చెబుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
మహిళా సాధికారత నేపథ్యంలో ‘అభయ’.. టైటిల్ పోస్టర్ ఇదే!
Vijay Deverakonda: రౌడీ స్టార్.. లైనప్ అదిరింది..