నేషనల్ అవార్డ్.. రాయన్ కన్నా మంచి సినిమా లేదా

ABN , Publish Date - Jul 19 , 2026 | 09:55 AM

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రకటించిన అవార్డులపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Raayan

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రకటించిన అవార్డులపై నెటిజన్లు, సినీ విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ధనుష్ (Dhanush) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రివెంజ్ డ్రామా రాయన్ (Raayan) చిత్రానికి ఉత్తమ తమిళ చిత్రంగా (Best Tamil Film) జాతీయ అవార్డు దక్కడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారితీసింది. బాక్సాఫీస్ వద్ద కేవలం వసూళ్లు సాధించిన ఒక రెగ్యులర్ యాక్షన్ సినిమాకు జాతీయ స్థాయి అత్యుత్తమ పురస్కారం ఎలా ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురుస్తోంది.


ఈ నిర్ణయం ఇంతలా వివాదాస్పదం కావడానికి ప్రధాన కారణం.. 2024 ఏడాదికి గాను తమిళం నుంచి రేసులో ఉన్న మహారాజా, సత్యం సుందరం వంటి మాస్టర్ పీస్ చిత్రాలను జ్యూరీ పూర్తిగా విస్మరించడమే. విజయ్ సేతుపతి కెరీర్ లోనే మైండ్ బ్లోయింగ్ స్క్రీన్‌ప్లే, గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌తో వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాజా చిత్రానికి ఈ అవార్డు దక్కుతుందని అందరూ భావించారు. అలాగే కార్తీ, అరవింద్ స్వామిల నటనతో, స్వచ్ఛమైన మానవ సంబంధాల నేపథ్యంలో దశాబ్ద కాలంలోనే అత్యుత్తమ ఫీల్ గుడ్ చిత్రంగా నిలిచిన సత్యం సుందరం ను కూడా జాతీయ అవార్డు వరించకపోవడం గమనార్హం.


వీటితో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న కల్ట్ క్లాసిక్స్ వాళై, లబ్బర్ పందు, కొట్టుక్కాలి, ఆడు జీవితం వంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న చిత్రాలను పక్కనబెట్టి, ఒక రొటీన్ రివెంజ్ యాక్షన్ డ్రామా అయిన రాయన్ కు బెస్ట్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడం వెనుక అర్హత కంటే కమర్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జాతీయ అవార్డుల జ్యూరీ తీసుకున్న ఈ పక్షపాత నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్, ట్రోల్స్ తో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదంపై జ్యూరీ సభ్యులు లేదా ధనుష్ టీమ్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Updated Date - Jul 19 , 2026 | 10:27 AM